తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు పెంచింది. విచారణకు పిలిస్తే రాకుండా గైర్హాజు అయిన వారిపై తీవ్ర అసహనం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వారిని ఎలాగైనా విచారణకు రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ముగ్గురిని వాటెండ్ జాబితాలో చేర్చి సంచలనం సృష్టించింది. 


తెలంగాణకు చెందిన శ్రీనివాస్‌తో పాటు బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామిలకు సోమవారం హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. వారిలో శ్రీనివాస్ మాత్రమే సిట్ విచారణ కోసం.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చారు. మిగిలిన ముగ్గురూ హాజరు కాలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. 


నోటీసులు జారీ చేసినా.. హాజరు కాలేదు. రాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో స్పష్టంగా చెప్పారు. అయితే అరెస్టులు వద్దని హైకోర్టు చెప్పడంతో అరెస్టు చేసే ఛాన్స్ లేదు. అందుకే ఆ ముగ్గురిని వాంటెడ్‌ జాబితాలో చేర్చారు సైబరాబాద్ పోలీసులు. అంతే కాదు ఆ ముగ్గురికి లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేసింది. దేశంలో అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేశారు తెలంగాణ పోలీసులు.


మరోవైపు కోర్టు దృష్టికి కూడా ముగ్గురు గైర్హాజరు విషయాన్ని సిట్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. విచారణకు సహకరించలేదు కాబట్టి అరెస్ట్ చేసేందుకు ఛాన్సివ్వాలని హైకోర్టును అభ్యర్థించే అవకాశం ఉంది. హైకోర్టు అనుమతి ఇస్తే అరెస్ట్ చేయగలరు. 


ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కేవలం తెలంగాణకు పరిమితమై ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ నిందితులు ఎవరూ తెలంగాణకు చెందిన వారు కాదు. బీజేపీ తెలంగాణ నేతలకు తెలియదని.. పోలీసులే ప్రకటించారు. బయట నుంచి వచ్చిన నేతలే బేరాలు నడిపారని అంటున్నారు. రామచంద్రభారతి తెలంగాణలో ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు. ఆయనతో టచ్‌లో ఉండి.. డీల్‌కు ప్రయత్నించిన నేతలెవరూ తెలంగాణలో లేరు. అందుకే వాళ్లెవరు? వాళ్లు ఎక్కడున్నారు అనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది.