House Prices in Hyderabad: ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 5 శాతం ఇళ్ల ధరలు పెరిగినట్లు ప్రాప్ టైగర్ అనే స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ వెల్లడించింది. చదరపు అడుగు నిర్మాణ స్థలం (ఎస్ఎఫ్టీ)ధర గత ఏడాది చివరి నాటికి 6,300 రూపాయల నుంచి 6,500 వరకు ఉండగా.. అది 6,600 రూపాయల నుంచి 6,800 రూపాయలకు పెరిగనట్లు పేర్కొంది. బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబయి, పుణె.. తదితర నగరాల్లో ఇళ్ల ధరల తీరుతెన్నలను ఈ సంస్థ విశ్లేశించింది. హైదరాబాద్ నగరంలో ఇళ్ల ధరలు 4 శాతం పెరిగినట్లు స్పష్టం చేసింది. గత ఏడాది చివరి నాటికి హైదరాబాద్ లో ఎస్ఎఫ్టీ నిర్మాణ స్థలం ధర 5,900 రూపాయల నుంచి 6,100 రూపాయల వరకు ఉండగా... ప్రస్తుతం రూ.6,100 నుంచి 6,300 వరకు ధర పలుకుతున్నట్లు వివరించింది.
కచ్చితంగా ఇళ్లు ఉండాలన్న సెంటిమెంట్..
'దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ రికవరీ అవుతోంది. ధరల్లో వృద్ధి కనిపిస్తోంది. కొవిడ్ తర్వాత సొంత ఇల్లు ఉండాలన్న సెంటిమెంటు ప్రజల్లో బలంగా పెరిగింది. ఇవన్నీ రియల్ ఎస్టేట్ వృద్ధికి దోహదం చేస్తున్నాయి' అని క్రెడాయ్ నేషనల్ అధ్యక్షుడు హర్ష వర్దన్ పటోడియా తెలిపారు. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో రేట్లు పెరిగాయని, టాప్ డెవలపర్లు కొత్త ప్రాజెక్టులు ఆరంభిస్తున్నారని పేర్కొన్నారు.
'ఈ ఏడాది చివరి వరకు పండగల జోష్ కొనసాగుతుంది. అమ్మకాలు పెరుగుతాయని మేం అంచనా వేస్తున్నాం. అంతర్జాతీయ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇక్కడా ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. సొంతిటి కల నేరవేర్చుకొనేందుకు వినియోగదారులు ప్రయత్నిస్తుండటంతో ధరలు పెరిగే అవకాశం ఉంది' అని పటోడియా వెల్లడించారు.
ముంబయిలో 3, పుణెలో 7 శాతం పెరిగిన ఇళ్ల ధరలు..
ఇళ్ల ధరలు ఈ ఏడాదిలో స్వల్పంగా పెరిగాయి. నిర్మాణ వ్యయం పెరగడం దీనికి ప్రధాన కారణం అని ప్రాప్ టైగర్ గ్రూప్ సీఎఫ్ఓ వికాస్ వాధ్వాన్ అన్నారు. ముఖ్యంగా సిమెంట్, స్టీలు ధరలు పెరిగినట్లు, దాని ప్రభావం ఇళ్ల ధరలపై కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి తోడు ఇళ్లకు గిరాకీ తగ్గలేదని తెలిపారు. సమీప భవిష్యత్తులో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్ లో ఇళ్ల ధరలు 5 శాతం, బెంగళూరులో 6 శాతం, కోల్ కతాలో 3 శాతం, చెన్నైలో 2 శాతం పెరిగాయి. ముంబయిలో 3 శాతం, పుణెలో 7 శాతం ధరలు పెరిగినట్లు ఈ నివేదిక వివరించింది. బెంగళూరులో ఎస్ఎఫ్టీ ధర ప్రస్తుతం రూ.5,900-6,100 పలుకుతోంది.
నిర్మాణంలో ఉన్నవాటి కంటే పూర్తయిన ఇళ్లకే ఎక్కువ ప్రాధాన్యం..
అదే సమయంలో ఇళ్ల ధరలు (ఎస్ఎఫ్టీ) ముంబయిలో రూ.9,900-10,100 పుణెలో రూ. 5,500-5,700 ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న ఇళ్ల కంటే నిర్మాణం పూర్తయి... వెంటనే చేరిపోవడానికి అనువుగా ఉన్న ఇళ్లను కొనుగోలుదారులు ఇష్టపడుతున్నట్లు "ప్రాప్ టైగర్" రీసెర్చ్ హెడ్ అంకిత సూద్ అన్నారు.