తెలంగాణలో పోడు భూముల సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్‌... అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్య న్యాయమైన డిమాండ్ కాదని తేల్చేశారు. పోడు భమూలు కావాలంటే దురాక్రమణే అన్నారు. అటవీ బిడ్డలం తమకు అటవీ భూములు ఇవ్వాలంటే మొత్తం అడవులు నరికిస్తే పీడపోతుందన్నారు. ప్రతిసారీ దీనిపై రాజకీయం చేయడం అలవాటైపోయింది. అడవులన్నీ నరికేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఈ సమస్య నేటికీ వెంటాడుతోందన్నారు కేసీఆర్ 


ఇలా అడవిని కొట్టి అందరికీ పంచేద్దామా అని ప్రశ్నించారు కేసీఆర్. గతంలో ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ విషయం పెద్ద సమస్యగా మారిందన్న సీఎం... కొన్ని పార్టీలకు ఇదో ఆట వస్తువుగా మారిందని ఎద్దేవా చేశారు. కొందర్ని పోగేసి కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు చేయడం అలవాటుగా మారిందన్నారు. గిరిజనులను కాపాడటంలో ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారి హక్కులకు ఎలాంటి భంగం కలిగించదన్నారు. 


రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా కనుమరుగు కావాలా... బ్రెజిల్, చైనా తర్వాత చాలా కష్టపడి తెలంగాణలో అటవీ విస్తీర్ణం పెంచామన్నారు కేసీఆర్. అధికారులను బెదిరిస్తే కానీ నేడు  మొక్కలను సంరక్షించుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్‌లో ఎలాంటి సినిమా షూటింగ్‌లు అయ్యేవో దాన్ని ఎలా నాశనం చేశారో అందరికీ తెలిసిందే అన్నారు. 


కనుమరుగైన అటవీ సంపదను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. ఇలా చేసిన కృషి ఫలితంగానే మంచి రిజల్స్ట్‌ కూడా వచ్చాయని... దానికి అనేక అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా పేరు వచ్చిందన్నారు. 7.8 అటవీ విస్తీర్ణం పెరిగిందని అంతర్జాతీయ సంస్థలు కితాబు ఇచ్చాయని వెల్లడించారు. 


అయితే పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉందన్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు ఎవరైతే సాగు చేసుకుంటున్నరో... వాళ్లకు పట్టాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారు. అయితే పోడు సమస్య ఇంకా ఇదేవిధంగా కొనసాగాలా.. దీనికి ముగింపు కావాలా... అని ప్రశ్నించారు. పోడు భూముల పంపిణీ తర్వాత... ఎవరైనా ఇంకా పేదరికంలో ఉంటే దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు ప్రకటిస్తామని గిరిజన పెద్దలకు చెప్పామన్నారు. 


తెలంగాణలో అరవై ఆరు లక్షల ఎకరాల్లో అటవీ భూమి ఉందని ఓ లెక్క ఉంది. దీనిలో పోడును వేరు చేసి ఎలా పంపిణీ చేయాలో విచారణచేశామన్నారు. చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలోనే ఎంక్వయిరీ నడిచిందన్నారు. జిల్లా కలెక్టర్లు ఫైనల్ నివేదిక సిద్ధం చేశారని తెలిపారు. అయితే ప్రతి గ్రామంలో సర్పంచ్, అఖిల పక్షం నేతలు... భవిష్యత్‌లో పోడు భూముల సమస్య ఉండబోదని ప్రకటిస్తేనే పట్టాలు ఇస్తామన్నారు. ఇకపై అడవులు నరికివేత ఉండబోదంటేనే పదకొండున్నర లక్షల పోడు భూముల పంపిణీకి సిద్ధంగా ఉన్నామన్నారు. 


ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని ఛత్తీస్‌గఢ్‌ నుంచి గొత్తికోయలనను తీసుకొచ్చి రాత్రికి రాత్రే అడవులను నరికించేస్తున్నారని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు చాలా వైలెంట్‌గా అటవీ అధికారులను నరికేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అధికారి శ్రీనివాస్ మృతికి ఎవరు బాధ్యులను ప్రశ్నించారు. అలా అధికారులపై దాడు చేయడం కరెక్టేనా అని నిలదీశారు. దాన్ని సమర్ధిదామా అన్నారు. 


అటవీ భూములను కొట్టేసి పట్టాలు ఇవ్వండీ అనేది న్యాయమైన డిమాండ్ కాదన్నారు కేసీఆర్. ప్రభుత్వం దయతలచి ఇస్తే తీసుకోవాలన్నారు. ఫిబ్రవరిలోనే పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల కోసం తాము పట్టాలు ఇవ్వదలుచుకోలేదన్నారు. ప్రతి ఒక్కరికి లెక్క ప్రకారం భూములు పంపిణీ చేస్తామన్నారు. పోడు భూముల పట్టాతోపాటు... వాళ్లకు విద్యుత్ కెనెక్షన్ ఇచ్చి... రైతు బంధు కూడా ఇస్తామన్నారు. కానీ... పట్టాలు తీసుకునే వాళ్లు భవిష్యత్‌లో అడవిని కాపాడే కాపాలాదారులు కావాలన్నారు. దీన్నిరాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లు రేపు మళ్లీ అడవిని  ఆక్రమిస్తే ఇచ్చిన పట్టా రద్దు చేసే చట్టం తీసుకొస్తామన్నారు. 


అటవీ అధికారుల దురుసు ప్రవర్తన కూడా ఉంది. దాన్ని కూడా సరిచేస్తున్నామన్నారు. అయితే గతంలో ఇచ్చినవి ఇప్పుడు ఇచ్చేవి మొత్తంగా ఎన్ని ఎకరాల్లో పోడు భూములు ఉన్నాయో తేలాల్సి ఉందన్నారు. పటిష్టమైన లెక్కల చూసి ఇద్దామన్నారు. ఆ లెక్కలను సభలో చర్చించి... ఇకపై గజం భూమిని కూడా ఆక్రమణ కాకుండా చేద్దామన్నారు. సంతకాలు పెట్టేందుకు ముందుకు రాని గ్రామాల్లో పట్టాలు ఇవ్వబోమన్నారు. కొందరు అగ్రకులాలకు చెందిన వ్యక్తులు గిరిజనుల అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకొని దోపిడీ చేస్తున్నారో దాన్ని కూడా అరికట్టాలన్నారు.