రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీసీ సంక్షేమ శాఖ అంచనాలను మంత్రి గంగుల కమలాకర్ గురువారం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చరిత్రలోనే తొలిసారిగా 6229 కోట్ల 20 లక్షల రూపాయల బడ్జెట్ ను బీసీలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిందన్నారు. దీంతో ఇప్పటివరకూ 44,672 కోట్లను కేవలం బీసీ సంక్షేమానికే కేటాయించిందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి వైఎస్ నుండి రాష్ట్రం ఏర్పడే వరకూ 10202 కోట్లను, కేటాయిస్తే చంద్రబాబు హాయాంలో కేవలం 2037 కోట్లను మాత్రమే కేటాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తుందని, బీసీ జనగణన చేయకుండా, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కనీసం బీసీ మంత్రిత్వ శాఖ లేకుండా బీసీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మొన్నటి 42 లక్షల కోట్ల కేంద్రబడ్జెట్లో బీసీలకు నికరంగా 2వేల కోట్లు కూడా లేకపోవడం దురద్రుష్టకరమన్నారు మంత్రి గంగుల కమలాకర్. 
కేటాయింపుల వివరాలు 
2023-24 బడ్జెట్ అంచనాలు సమర్పిస్తూ ప్రసంగించిన మంత్రి గంగుల కమలాకర్ ప్రగతి పద్దుగా 5521 కోట్లను, నిర్వహణా పద్దుగా 707 కోట్లుగా ఖర్చు చేస్తామన్నారు. కళ్యాణలక్ష్మీ బీసీల కోసం 2000 కోట్లు, బీసీ స్కాలర్ షిప్‌లు, ఫీజు రియంబర్మెంట్ కు 1550 కోట్లు, ఎంజేపీ సొసైటీలకు 880 కోట్లు, సంక్షేమ హాస్టళ్లకు 334 కోట్లు, బీసీ కార్పోరేషన్కి 303 కోట్లు, ఎంబీసీ కార్పోరేషన్కు 301 కోట్లు, ఫెడరేషన్లకు 561 కోట్లు, బీసీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకానికి 71 కోట్లు, బీసీ స్టడీ సర్కిళ్లకు 27 కోట్లు, ఆత్మగౌరవ భవనాలకు 90 కోట్లు, బీసీ కమిషన్కి 10 కోట్లు కేటాయించారు.  


ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రంలో వచ్చిన గణనీయ విప్లవాత్మక మార్పుల్ని మంత్రి గంగుల సభాలో ప్రస్తావించారు. మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల సొసైటీ కిఉమ్మడి రాష్ట్రంలో కేవలం 19 గురుకులాలుంటే నేడు 310 గురుకులాలకు పెంచామని, కేవలం ఈ ఒక్క సంవత్సరమే 33 స్కూళ్లు, 15 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసామని, వీటిలో మొత్తంగా 1,81 వేల విద్యార్థులు విద్యనభ్యసిస్తారన్నారు. వీరందరూ అత్యున్నత యూనివర్శిటీల్లో, ఐఐటీల్లో ప్రవేశం పొందడమే కాక ఆలిండియా సర్వీసులు, గ్రూప్స్, ఎస్సై తదితర పోస్టులకు సైతం ఎంపికయ్యారని, ప్రపంచ ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్శిటీతో ఎంజేపీ విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. క్రీడల్లోనూ అత్యుత్తమ సత్తా చాటుతూ అండర్ 19 బాక్సింగ్, అండర్ 16 షూటింగ్, ఫెన్సింగ్, రగ్బీ, వాలీబాల్ జాతీయ టీముల్లో ఎంజేపీ విద్యార్థులు ఉన్నారని తెలియజేసారు. 2150 మంది ఉద్యోగులుండగా ప్రస్థుతం 6446 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 
300 విద్యార్థులకు విదేశీ విద్య కోసం సహాయం
ప్రతీ సంవత్సరం 300 విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఒక్కొక్కరికి 20 లక్షల సహాయం అందజేస్తున్నామని, 2410 మందికి 312 కోట్లను ఖర్చు చేసామన్నారు మంత్రి గంగుల, 700 ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను నిర్వహిస్తున్నామని ఇందులో 61వేల మంది విద్యార్థులు సన్న బియ్యంతో బోజనం చేస్తూ విద్యను అభ్యసిస్తున్నారన్నారు. పీజు రియబర్మెంట్తో పాటు మెయింటెనెన్స్ పీజు, ట్యూషన్ పీజులను చెల్లిస్తున్న ప్రభుత్వం తమదని కేవలం బీసీ మెయింటెనెన్స్ పీజుల ద్వారానే 59 లక్షల మంది విద్యార్థులకు 2362కోట్లు ఖర్చు చేసుకున్నామని, రియంబర్మెంట్ కింద 53 లక్షల విద్యార్థులకు 5237 కోట్లను ఖర్చు చేసామన్నారు మంత్రి గంగుల కమలాకర్. 


12 బీసీ స్టడీ సర్కిళ్లను నిర్వహిస్తున్నామన్న మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భర్తీ చేస్తున్న 80,039 ఉద్యోగాలకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామన్నారు. ఎస్సై పరీక్షల్లో 1237 మంది క్వాలిఫై అయ్యారని, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం ఈ సంవత్సరమే 1,15,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే భూమిపూజ చేసుకున్న 29 ఆత్మగౌరవ భవనాలతో పాటు వేల కోట్ల విలువ చేసే 87.3 ఎకరాల్లో నిర్మిస్తున్న 41 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.


పేదింటి ఆడ పిల్లల పెళ్లికి మేనమామగా నిలిచిన కేసీఆర్ కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా లక్షా నూటాపదహార్లు అందిసున్నారన్నారు మంత్రి గంగుల కమలాకర్. 2016 నుండి నేటి వరకూ 5369 కోట్లను 5,89,000 మంది కుటుంభాలకు కేటాయించామన్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను చిన్నచూపు చూస్తుంటే కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం మాత్రమే బీసీ సంక్షేమానికి కట్టుబడి చేతల రూపంలో చూపిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. సభ్యులను కట్ మోషన్ ఉపసహించుకోవాలని కోరిన మంత్రి బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ని ఆమోదించాలని సభ్యులని కోరారు, ముఖ్యమంత్రి కేసీఆర్ కి, సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.