Telangana Budget Sessions 2023 : తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి మద్యాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకోవడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీ సాక్షిగా సూచించారు. ప్రతి గ్రామంలోని కిరాణ దుకాణాలు మద్యం షాపులుగా మారిపోయాయని, కనుక ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం మద్యం కాకుండా మరో మార్గం చూసుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. బడుగు బలహీన వర్గాలకు నిధులు సరిగ్గా ఖర్చు పెట్టడం లేదని, బీసీలకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చూపించాలని శాసనసభలో బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్న ఆయన డిమాండ్ చేశారు.  


బడుగు బలహీన వర్గాలకు నిధులు సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు, బడుగు, బలహీన వర్గాలపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం నిజంగా పనిచేసినట్లయితే, వారి కోసం ఈ 9 ఏళ్లలో బడ్జెట్ లో ఎంత మేర నిధులు కేటాయించారు, ఎంత మేర ఖర్చు చేశారో లెక్కలతో సహా చూపించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దివ్యాంగుల కోసం క్యాంపు పెట్టి ఎలక్ట్రానిక్ వాహనాలు ఉచితంగా ఇవ్వాలని కోరారు. బడ్జెట్ లో కేటాయింపులు తప్ప, నిధులను ఖర్చు చేయడం లేదనే విషయాలను బీజేపీ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని అధికార పక్ష సభ్యులు రఘునందన్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు.


ధరణి పోర్టల్‌పై రగడ! రద్దుకు శ్రీధర్ బాబు డిమాండ్ - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గురువారం (ఫిబ్రవరి 9) నాటి సభలో మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. ధరణి పోర్టల్ విషయంలో వీరిద్దరి మధ్య కాసేపు వాదన నడిచింది. కాంగ్రెస్ సభ్యుడైన దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారుతోందని అన్నారు. కొందరి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రైతులు గందరగోళంలో ఉన్నారని అన్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తేల్చి చెప్పారు. ఆ వెంటనే శ్రీధర్‌ బాబు వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. 


ధరణి పోర్టల్ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సమస్యలను ఎత్తి చూపాలని చెప్పారు. అందులో లోపాలు ఉంటే సరి చేస్తామని చెప్పారు. అంతేకానీ.. ధరణి పోర్టల్ మొత్తాన్ని తొలగించబోమని తేల్చి చెప్పారు. ధ‌ర‌ణిని ర‌ద్దు చేయ‌డం, ప్రగ‌తి భ‌వ‌న్‌ను బ‌ద్దలు కొట్టడం, బాంబుల‌తో పేల్చివేయాలని అనడం కాంగ్రెస్ విధానామా? అని కేటీఆర్ కాంగ్రెస్ స‌భ్యుల‌ను సూటిగా ప్రశ్నించారు. ధ‌ర‌ణి పోర్టల్‌ వల్ల సంతోషంగా ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. గ‌త ఆరేళ్లలో 30 ల‌క్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయితే, ఈ ఏడాదిన్నర కాలంలోనే 23 ల‌క్షల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయ్యాయని చెప్పారు. అన్నిస‌వ్యంగా జ‌రిగితే ఎవ‌రూ మాట్లాడ‌రని, ఎక్కడో ఒక చిన్న లోపం జ‌రిగితే భూత‌ద్దంలో పెట్టి చూపిస్తున్నారని అన్నారు. ఒక‌ట్రెండు లోపాలు జ‌రిగితే రాష్ట్రమంతా గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని చెప్పడం స‌రికాద‌ని కేటీఆర్ అన్నారు.