Charminar Bomb Threaten Phone Calls: హైదరాబాద్ నగరంలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. పాతబస్తీలో చారిత్రక ప్రదేశమైన చార్మినార్ కు బాంబు బెదిరింపు ఎదురైనట్లుగా.. చార్మినార్ లో పేలుడు పదార్థాలు పెట్టినట్లుగా ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసినట్లుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్‌తో చార్మినార్ వద్దకు వెళ్లి సోదాలు చేసినట్లుగా వార్తలు రావడంతో పోలీసులు ఈ గాలి వార్తలను ఖండించారు.
అయితే, తాము సాధారణ సోదాల్లో భాగంగానే సోమవారం చార్మినార్ (Charminar Police) పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, పరిసర ప్రాంతాలు, దుకాణాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశామని పోలీసులు తెలిపారు. ఇది గమనించిన కొంత మంది భయపడిపోయి బాంబు కోసమే తనిఖీలు చేస్తున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ మేరకు చార్మినార్ పోలీసులు (Charminar Police) స్పందించారు.
సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారం నమ్మవద్దని చార్మినార్ ఎస్సై వెల్లడించారు. బాంబు బెదిరింపు జరిగినట్లుగా పోలీసులకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని స్పష్టత ఇచ్చారు.
కొద్ది రోజుల క్రితం నిజంగానే బెదిరింపు కాల్
నవంబరు 15న పాతబస్తీ ఐ.ఎస్ సదన్ చౌరస్తాలో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు నవంబరు 16న అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్ పీఎస్ (Saidabad Police Station) పరిధిలోని ఐఎస్ సదన్ లో బాంబు ఉందంటూ డయల్ 100 కి అక్బర్ ఖాన్ అనే వ్యక్తి కాల్ చేశాడు. అనంతరం ఐఎస్ సదన్ కు చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేశారు. ఫోన్ లో చెప్పినట్టు అక్కడ ఎలాంటి బాంబు లేదని పోలీసులు చెప్పారు. ఆ ఆగంతుకుణ్ని పట్టుకొనేందుకు పోలీసులు యత్నించి నిందితుడిని పట్టుకున్నారు. అతను ఫోన్ చేసిన నెంబరు ఆధారంగా ఆచూకీని ట్రేస్ చేశారు. నిందితుడిపై సైదాబాద్ పీఎస్ లో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 182, 186, సిటీ యాక్ట్ 70 బీ ప్రకారం పోలీసులు కేసు పెట్టారు.
రాహుల్ గాంధీకి కూడా బాంబు బెదిరింపు
ఆఖరికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా బాంబు బెదిరింపులను పోలీసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లోని ఓ స్వీట్ షాప్‌లో బాంబు బెదిరింపు లేఖ దొరకటం కలకలం సృష్టించింది. ఈ షాప్‌లో ఎవరు ఈ లెటర్‌ను పెట్టి వెళ్లారన్నది తెలియరాలేదు. పోలీసులు దీనిపై విచారణ చేశారు. ఇండోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీలోని విజువల్స్‌ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇండోర్‌లోని ఖల్సా స్టేడియంలో రాహుల్ గాంధీ నవంబర్ 24వ తేదీ రాత్రి బస చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు బాంబు బెదిరింపులు రావడం సంచలనమైంది. ఎవరో కావాలనే తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటివి చేసి ఉంటారని ప్రాథమికంగా భావించారు. కానీ, విచారణ మాత్రం కొనసాగించారు.