Telangana Cabinet Meeting in New Secretariat: తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర కేబినెట్ బేటీ కానుంది. కొత్తగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స‌చివాల‌యంలో తొలిసారి రాత్రి మంత్రివర్గం సమావేశం కాబోతోంది. మే 18న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మొదలుకానున్న ఈ మంత్రివ‌ర్గ స‌మావేశంలో కీల‌క నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నందన సంక్షేమ పథకాల అమలు, నిధుల విడుదలపై కీలకంగా చర్చ జరగనుంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున బీసీ బంధు, దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పించన్ల పంపిణీ అమలు తీరుపై చర్చించనున్నారు.


పోడు పట్టాల పంపిణీ తేదీలు, గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రకటించి అమలు కార్యచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయం కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. గవర్నర్‌ నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్‌ పదవీకాలం ఈనెల 27తో ముగియనుంది. ఆ రెండు స్థానాలకు ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్‌ ఆమోదించి గవర్నర్‌ తమిళిసైకి సిఫారసు చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర కేబినెట్ చివరగా మార్చి 8న సమావేమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటి అమలుతీరుతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల (Telangana Formation Day Celebrations) నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కేబినెట్‌లో చర్చించి మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త సచివాలయం ఎదుట ప్రారంభానికి రెడీ అయిన వినూత్న రీతిలో నిర్మించిన తెలంగాణ అమర వీరుల స్మారకం ప్రారంభ తేదీని కూడా మంత్రి వర్గ సమావేశంలో ఖరారుచేసే అవకాశం ఉంది.


2018లో ఎన్నికల సమయంలో గృహలక్ష్మి పథకంపై బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో రూ.5 లక్షల ఇంటి నిర్మాణానికి అర్హులైన పేదలకు ఇస్తామన్నారు. కానీ మూడున్నరేళ్ల పాలన ముగిశాఖ ఆ మొత్తాన్ని రూ.3 లక్షలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 3.57 లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేసే దిశగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. 2023-24 బడ్జెట్ లో రూ.12,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ ఇప్పటివరకూ ఒక్కరూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. దీనిపై సైతం కేబినెట్ భేటీలో కీలకంగా చర్చ జరిగేలా కనిపిస్తోంది.


గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులపై కీలక చర్చ! 
గవర్నర్ తమిళిసై తిప్పిపంపిన రెండు బిల్లులపై ఏం చేయాలని మంత్రివర్గంలో చర్చ జరగనుంది. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ సవరణ బిల్లు 2022 ప్రకారం ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ల వయో పరిమితిని 61 నుంచి 65కు పెంచాలన్న ప్రతిపాదనపై కేబినెట్ మరోసారి కసరత్తు చేయనుంది. మున్సిపల్ శాఖకు సంబంధించి కో ఆప్షన్ మెంబర్ల సంఖ్యను పెంచడం అంశం బిల్లుపై సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.


గొర్రెల పంపిణీకి సంబంధించి రూ.4,463 కోట్లు కేటాయించినా నిధుల కొరత వెంటాడుతోంది. కానీ ఎన్నికలకు ముందు జరుగుతున్న కేబినెట్ భేటీ కావడంతో ఇటీవల కేసీఆర్ హామీ ఇచ్చిన ఆర్టీసీ సిబ్బంది జీతాల పెంపుతో పాటు, కల్లుగీత కార్మికులు కల్లు గీస్తూ ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.5 లక్షల ఆర్థికసహాయం అందించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.