కాలుష్యం, శబ్దం లేకుండా ఏసీలో విలాసవంతమైన ప్రయాణం చేసే దిశగా టీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిన్న (మే 16) ఈ-గరుడ బస్సులను కొత్తగా 10 బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులను హైదరాబాద్ - విజయవాడ మధ్య తిప్పనున్నారు. హైదరాబాద్‌లో మియాపూర్ నుంచి, ఎంజీబీఎస్ నుంచి విజయవాడ రూట్‌లో  ‘ఈ-గరుడ’ పేరుతో ఈ ఎలక్ట్రిక్‌ బస్సుల సర్వీసులు ఇప్పటికే మొదలయ్యాయి. కొత్త బస్సుల ప్రారంభం సందర్భంగా నెల రోజుల పాటు ఈ - గరుడ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్టు రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. మియాపూర్‌ నుంచి విజయవాడకు ఈ-గరుడ బస్సు ఛార్జీని రూ.830గా నిర్ణయించారు. దీన్ని కొత్త ఆఫర్ కింద రూ.760కే అందిస్తామని చెప్పారు. ఎంజీబీఎస్‌ నుంచి విజయవాడకు రూ.780గా ఉన్న టికెట్‌ ధరను రూ.720కి తగ్గించామని స్పష్టం చేశారు.


హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో మంగళవారం (మే 16) పది బస్సులను ప్రారంభించారు. దశలవారీగా 50 ఎలక్ట్రిక్‌ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. మిగతా బస్సులను ఈ ఏడాది చివరి నాటికి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేస్తుంది. ఇవి కూడా అందుబాటులోకి వస్తే ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు విజయవాడకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 


ఈ-గరుడ బస్సులు బయలుదేరే సమయాలు ఇవీ


* మియాపూర్ నుంచి : 6:25, 8:25, 10:25, 18:05, 19:45, 21:45 గంటలకు..


* ఎంజీబీఎస్‌ నుంచి : 8:10, 10:10, 12:10, 19:50, 21:30, 23:30 గంటలకు..


* విజయవాడ నుంచి : 6:20, 8:00, 10:00, 18:40, 20:40, 22:40 గంటలకు..


Also Read: ఇక్కడ తయారైన మద్యం మాత్రమే అమ్మాలి, వారిపై కఠిన చర్యలు - మంత్రి శ్రీనివాస్ గౌడ్


మొత్తం 10 ఈ - గ‌రుడ బ‌స్సుల‌ను నిన్న (మే 16) మియాపూర్‌లోని పుష్పక్ ఎయిర్ పోర్ట్ లైనర్ బస్సుల ప్రాంతంలో ప్రారంభించారు. రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ధన్, ఎండీ వీసీ స‌జ్జనార్ తదితరులు జెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు.


ఈ-గరుడ బస్సుల ప్రారంభం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  మాట్లాడుతూ..  ఎలక్ట్రిక్ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నవంబర్, డిసెంబర్ నాటికి ఇంకో 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోస్తామని చెప్పారు. హైదరాబాద్ లో తిప్పడానికి త్వరలో 10 డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తామని అన్నారు. హైదరాబాద్ లో సిటీ బస్సులుగా ఎలక్ట్రిక్ బస్సులను వీలైనంత తొందరగానే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. వాటిని మెట్రో స్టేషన్‌కు అనుసంధానం చేస్తామని వివరించారు.


Also Read: Hyderabad: నల్ల కవరులో మహిళ తల! మొండెం వెతికినా జాడ లేదు - మలక్‌పేట్‌లో మిస్టరీగా కేసు