Telangana: శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్‌పై విమర్శల వాడిని బీఆర్ఎస్ పెంచింది. ఎన్నికల టైంలో గల్లీగల్లీకి తిరిగిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తారా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
సోషల్ మీడియా వేదికగా జాబ్ క్యాలండర్‌పై విమర్శలు చేసిన కేటీఆర్... రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్స్‌లో ఆయనపై విమర్శలు చేశారు. ఏడాదిలో రెండు లక్షలు ఇస్తామన్న హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నేలలు దాటిందని ఇంత వరకు ఉద్యోగాలు ఇచ్చింది లేదని ఆరోపించారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పకుండా జాబ్‌లెస్ క్యాలెండర్ విడుదల చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల ముందు వచ్చినట్టుగా ఇప్పుడు కూడా ఓసారి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ రావాలని రాహుల్‌ను ఆహ్వానించారు కేటీఆర్. అక్కడ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతతో మాట్లాడి ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల టైంలో యువకులతో వచ్చిమాట్లాడిన వీడియోను తన ఎక్స్ లో షేర్ చేశారు.
తమకు పోరాటం మాకు కొత్త కాదన్నారు కేటీఆర్. రాత్రి అరెస్టు చేసి విడిచి పెట్టడంపై స్పందిస్తూ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించిన రాహుల్ గాంధీపై అవసరమైతే ఢిల్లీలో పోరాటం చేస్తామని ఎక్స్‌లో తెలిపారు. బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటామని తెలిపారు.