తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, కీలక నేతలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఓటమి పాలైన నియోజకవర్గాల్లోని పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా వారితో కేటీఆర్ ఈ సందర్భంగా వారితో కేటీఆర్ మాట్లాడారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని, అందుకే ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా, మన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారన్నారు. ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని సూచించారు. ఎన్నికల తర్వాత ప్రజల నుంచి మన పార్టీ నాయకత్వం పైన ఒక సానుకూల స్పందన వస్తున్నదని, మన పార్టీ అధికారం కోల్పోతుందని అనుకోలేదని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి వందలాది మెసేజ్లు వస్తున్న విషయాన్ని కేటీఆర్ తో పాటు, పార్టీ నాయకులు చర్చించారు.
త్వరలోనే పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు పోదాం అన్నారు. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం, ప్రగతి భవన్ కేంద్రంగా విధులు నిర్వహించిన మనమంతా, ఇకపైన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉందామన్నారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా మూడో సారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తామనుకున్న బీఆర్‌ఎస్ పార్టీకి పరాజయం తప్పలేదు. మొత్తం 119 స్థానాలకుగాను 39 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. దీంతో అధికారం దూరం అయింది. కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు వచ్చాయి. దీంతో నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.