Telangana CM oath Ceremony at Raj Bhavan: తెలంగాణ(Telanagana) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections 2023) ఘన విజయం సాధించిన కాంగ్రెస్ (Congress)పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలైపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సీఎల్పీ సమావేసం జరుగుతోంది. అక్కడ సీఎం అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. తెలంగాణలో చాలా మంది సీఎం అభ్యర్థులం అంటూ గతంలో స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీనిపై పెద్ద వివాదం నెలకొంటుందని అంతా భావించారు. అయితే ఆలాంటి సమస్య లేకుండా సీఎం అభ్యర్థి ఎంపికను స్మూత్‌గా డీల్ చేయాలని అధినాయకత్వం భావిస్తోంది. 


తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికను ఎలాంటి హర్డిల్స్ లేకుండా ఎంపిక చేసే బాధ్యతను కర్ణాటక సీనియర్ నేతలకుఅప్పగించారు. ఈ మధ్య కాలంలో కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎంపికపై నాలుగైదు రోజులు పంచాయితీ నడిచింది. అక్కడ అనుభావాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్మూత్‌గా డీల్ చేయాలని చూస్తున్నారు. అందుకే ఆ బాధ్యతను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అప్పగించారు. 


సీఎం అభ్యర్థి ఎంపిక తర్వాత వెంటనే ప్రమాణ స్వీకారం చేసేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. ఈ అంశంలో నేతలు తలో మాటకు అవకాశం లేకుండా చేయాలని చూస్తోంది. అందుకే అలాంటి అసంతృప్త నేతలకు అవకాశం ఇవ్వకుండా ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు సీఎల్పీ నేత ఎంపిక సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించాలని చూస్తోంది. 


ఇప్పటికే రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు వెళ్లినట్టు ప్రచారం నడుస్తోంది. ప్రమాణ స్వీకారానికి తగిన ఏర్పాటు చేయాలని కూడా జీఏడీకి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయని చెప్పుకుంటున్నారు. ఒకసారి సీఎంగా ప్రమాణం చేస్తే మిగతా పరిస్థితి వాటికవే చక్కబడతాయని భావిస్తున్నారు. 


తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్ కంటే ఐదు సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అందుకే కాంగ్రెస్ ముందు జాగ్రత్త పడింది. సీఎం అభ్యర్థి ఎంపిక తర్వాత నేతలు వేరే ఆలోచనలు చేయకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెజార్టీ వచ్చినప్పటికీ వేర్వేరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో విఫలమైన అనుభవాలను కాంగ్రెస్ గుర్తు చేసుకుంటుంది. అందుకే ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఇల్లు చక్కదిద్దే పనిలో పడింది. 


అందుకే సాయంత్రం ఆరు గంటలకు ఎలాంటి హడావుడి లేకుండా సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగించాలని చూస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.