- అడవికి గాయమైతే చూస్తూ ఊరుకునే సంస్కృతి తెలంగాణది కాదు
- యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం
- వల్లంకి తాళం లో వెంకన్న రచనా శైలి అద్భుతం
- హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత


హైదరాబాద్: దేశంలో ఫాసిస్టు పాలన నడుస్తోందని, దీనికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు గళమెత్తాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) స్పష్టం చేశారు. దేశంలో ఫాసిస్టు తరహా వ్యవస్థ  నడుస్తోందని,  ఈ సందర్భంలో ఏం చేస్తే బాగుంటుందన్న కవులు, కళాకారులు, రచయితలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.  దీనిపై ఎమ్మెల్సీ గొరటి వెంకన్న సూచనలు తీసుకున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 36వ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆదివారం నాడు కవిత సందర్శించారు. అనంతరం ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించిన “వల్లంకి తాళం” పుస్తకంపై చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. వల్లంకి తాళంపై కవిత అడిగిన ప్రశ్నలకు వెంకన్న సమాధానాలు ఇచ్చారు.


నల్లమల అడవులతో తనకు అనుబంధం 
నల్లమల అడవిని, ప్రకృతిని, చెంచులు అద్భతమైన శైలిలో వర్ణించారని కొనియాడారు. ప్రత్యేకంగా నల్లమల అడవులతో తనకు అనుబంధం ఉందని అన్నారు. యురేనియం, వజ్రాల కోసం కేంద్ర ప్రభుత్వం అడవిని తవ్వే ప్రయత్నం చేసిందని, తెలంగాణ ఉద్యమ సమయంలో తాను, మరికొంత మంది అప్పుడు పెద్ద ఎత్తున  ఆందోళన చేశామని, మైనింగ్ లీజును రద్దు చేసే వరకు పోరాటం చేశామని వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యురేనియం తవ్వకాలకు కేంద్రం మళ్లీ వస్తే తవ్వనిచ్చే ప్రశ్నే లేదని అసెంబ్లీలో తీర్మానం చేశారని చెప్పారు. అడవికి గాయమైతే చూస్తూ ఊరుకునే సంస్కృతి మనది కాదని తేల్చిచెప్పారు.


వల్లంకి తాళలోని కవితలను పదేపదే తాను చదివానని చెప్పారు.  పుస్తకంలో అనేక పండ్ల గురించి ప్రస్తావనలు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాండలికంపై చర్చ జరిగిందని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు వివిధ భాషా మాండలికల్లో మాట్లడుతారని తెలియజేశారు. అలాంటింది మాండలికాల్లో ఉప మాండలికంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి గోరటి వెంకన్న రాయడం తనకు సంతోషాన్నిచ్చిందని తెలిపారు. వెంకన్న రచనా శైలి అద్భుతంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ జాగృతి  ఆధ్వర్యంలో యువ కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తే 2500 మంది పిల్లలు, విద్యార్థులు కవిత్వం రాశారని, కాబట్టి కవిత్వం పట్ల ఆసక్తి ఉన్నవాళ్లను ప్రోత్సహించడం ఎలా అని వెంకన్నను అడిగి తెలుసుకున్నారు.


తొలి అవార్డు సురవరం ప్రతాపరెడ్డికే 
దేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తొలి అవార్డు తెలుగులో తెలంగాణ బిడ్డకు 1955లో సురవరం ప్రతాపరెడ్డికే వచ్చిందని గుర్తు చేశారు. ఆ పరంపర ఇవాళ గోరటి వెంకన్న వరకు కూడా కొనసాగుతూ వస్తున్నదని చెప్పారు. సురవరంతో పాటు సి నారాయణ రెడ్డి, దాశరథి, ఎన్ గోపి, చేకూరి రామా రావు, అంపశయ్య నవీన్, సామల సదాశివ, కాత్యాయని విధ్మయే, నిఖిలేశ్వర్, గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయని, ఇటువంటి మహానుభావులు, గొప్ప కవులు ఉన్న వారసత్వం తెలంగాణదని స్పష్టం చేశారు. మన కవులు కేవలం ఈ రోజు చదివి రేపు మరిచిపోయే విధంగా కాకుండా ప్రజల హృదయాల్లో తరతరాలు గుర్తుండిపోయేటటువంటి రచనలు చేశారని తెలిపారు.


“ఆంధ్రుల సాంఘీక చరిత్ర”లో సురవరం ప్రతాప రెడ్డి ఆనాటి సామాజిక పరిస్థితులను విశ్లేషణ చేశారని,  కాళోజి నారాయణ రావు ప్రజల గోసను తన గొడవగా చెప్పుకున్నారని కల్వకుంట్ల కవిత అన్నారు. సి నారాయణ రెడ్డి విశ్వమానవుల గురించి “విశ్వంభర”లో వివరించారని, దాశరథి చాలా సంవేదనతో ఈ భూగోళం పుట్టాలంటే ఎన్ని సురగోళాలు కూలిపోయాయో...ఇప్పటి మానవ రూపం జరగడానికి ఎంత పరిణామం చెందాల్సి వచ్చిందోనని తన బాధను వ్యక్తం చేశారని వివరించారు. వారి వారసత్వాన్న కొనసాగిస్తూ మూలాల్లోకి వెళ్లి అడవిని, అడవి జీవితాన్ని , చెట్టును, పుట్టను, పక్షిని పరిశీలించి వెంకన్న అద్భుతమైన రచనలు చేశారని పేర్కొన్నారు.


పనిలో నుంచి, శ్రమలో నుంచి వచ్చిన పదాలను మనం కాపాడుకున్నాం కాబట్టే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని అంటారని చెప్పారు. తెలంగాణ యాసనే కాకుండా మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టిన పదాలను వల్లంకి తాళం పుస్తకంలో వెంకన్న వాడారని అన్నారు. తెలుగులోని తేనెదనాన్ని, కమ్మదనాన్ని మరొకసారి పరిచయం చేసినట్టుగా వల్లంకి తాళం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలకు ఉన్న మట్టి తత్వాన్ని ప్రతిబింబించారని చెప్పారు.