BRS leader Harish Rao slams Congress government | హైదరాబాద్‌: నగరంలో హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు... నేరాల రేటు గణనీయంగా పెరిగిందని ఆరోపించారు. తెలంగాణలో శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదన్నారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సమీక్ష చేయడం లేదని మండిపడ్డారు.  


బీఆర్ఎస్ పాలనలో మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటంపై హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార బాధితురాలికి భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 






తనపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని ఓ యువతి గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాను సోమవారం అర్ధరాత్రి ఆర్‌సీ పురం వద్ద ఆటో ఎక్కగా.. అర్ధరాత్రి 2:30 గంటలలకు మసీద్‌ బండ ప్రాంతానికి చేరుకోగానే ఆటోడ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.


Also Read: Hyderabad Crime: అదృశ్యమైన బాలిక కేసు విషాదాంతం, గోనె సంచిలో మృతదేహం లభ్యం