Telangana News: వికారాబాద్ జిల్లాలోని దామగుండంలో నిర్మించే వీఎల్​ఎఫ్ రాడార్ స్టేషన్ శంకుస్థాపన అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు.  ఈ ప్రాజెక్ట్ దేశానికి అత్యంత ఉపయోగకరమైనదిగా అభిప్రాయపడ్డారు. అబ్దుల్ కలాం జయంతి రోజున ఈ పనికి భూమి పూజ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌కి రాజ్‌నాథ్‌ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు. దేశం భద్రత రక్షణ విషయంలో రాజకీయాలు చేయడం లేదని అన్నారాయన. దేశం పటిష్టంగా ఉండేందుకు గట్టి భద్రత కోసం ఇలాంటి స్టేషన్లు అత్యంత ముఖ్యమైనవిగా తెలియజేశారు. పూర్వం కమ్యూనికేషన్, సమాచారం కోసం గద్దలను, ఇతర పక్షులను ఉపయోగించామని గుర్తు చేశారు. 


కమ్యూనికేషన్‌లో చాలా మార్పులు


నాటి నుంచి నేటి వరకు అనేక రకాలుగా సాంకేతికత అభివృద్ధి చేసి వాడుకుంటున్నామని అన్నారు రాజ్‌నాథ్‌. ఇతర కమ్యూనికేషన్‌ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉపయోగిస్తున్నామన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ముప్పై సంవత్సరాల నుంచి మన దేశం కమ్యూనికేషన్ వ్యవస్థలో చాలా మార్పలు వచ్చిన సంగతిని కేంద్రమంత్రి వివరించారు. 


ప్రాజెక్టుపై దుష్ప్రచారం నమ్మొద్దు


దేశం బలమైన సైనిక వ్యవస్థను నిర్మించుకోవడానికి కట్టుబడి ఉందన్నారు రాజ్‌నాథ్‌ సింగ్. కొందరు వ్యక్తులు రాడార్ ప్రాజెక్ట్ గురించి తప్పుడు అభిప్రాయాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. పర్యావరణానికి నష్టం జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ పర్యావరణానికి హాని కలిగించదని  హామీ ఇచ్చారు. దేశ రక్షణ భద్రత విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. 


పదేళ్లలో ఇండో ఫసిఫిక్ బెల్టులో సవాళ్లు పెరిగాయని గుర్తు చేశారు రాజ్‌నాథ్‌ సింగ్. అందుకు తగ్గట్టుగానే మమ దేశం కూడా ప్రత్యేక శక్తియుక్తులను కలిగి ఉండాలని అన్నారు. సముద్రాలపై ఆధిపత్యం సాధించిన దేశాల ప్రగతి శరవేగంగా దూసుకెళ్తుందన్నారు రాజ్‌నాథ్. అందుకే మన దేశ సముద్ర ఖనిజ సంపదపై వేరే దేశాలు దృష్టి పెట్టినట్టు తెలియజేశారు. అన్నింటినీ తట్టుకొని రోజు రోజుకు సాంకేతికంగా అభివృద్ధి సాధించాలని గుర్తు చేశారు.  


వికారాబాద్‌లోని రిజర్వు ఫారెస్ట్‌లో ఏర్పాటు చేయబోయే రాడార్ స్టేషన్‌ను 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇక్కడ ఒక్క రాడార్ స్టేషన్ మాత్రమే కాకుండా భారీ ఎత్తున టౌన్‌షిప్‌ను కూడా అభివృద్ధి చేయనుంది. స్కూల్స్, ఇతర మౌలిక సదుపాయలు కల్పించనున్నారు. అందుకే అక్కడ స్కూల్స్‌లో స్థానికులకు వాటా ఇవ్వాలని కేంద్రాన్ని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 


పదేళ్లక్రితమే ఈ రాడార్ స్టేషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చినా భూబదలాయింపులో జరిగిన జాప్యం కారణంగా ఇన్నేళ్లు పనులు ముందుకు కదలేదు. 2017 భూములు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత వాటిని బదలాయింపులో జాప్యం చేసిందని సమాచారం. ప్రభుత్వం మారిన తర్వాత ప్రక్రియ వేగవంతం చేసింది. దీంతో రాడార్ శంకుస్థాపనకు మార్గం ఈజీ అయ్యింది. 


Also Read: దామగుండంలో రాడార్‌ కేంద్రానికి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన- విద్యాసంస్థల్లో 1/3వ వంతు సీట్లు కేటాయింపునకు సీఎం రేవంత్ విజ్ఞప్తి