Telangana News: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి పరీక్షలను యథావిధిగా కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాయిదా కోరుతు దాఖలైన పిటిషన్లు కొట్టేసింది. 


తెలంగాణలో గ్రూప్ వన్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అక్టోబర్ 21 నుంచి పరీక్షలు ఉన్న వేళ వాయిదా వేయాలన్న పిటిషన్లపై కోర్టు ఎలాటి తీర్పు ఇస్తుందో అన్న భయం అభ్యర్థుల్లో ఉంది. అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 21 నుంచి నిర్వహించే పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


అక్టోబర్ 21 నుంచి నిర్వహించబోతున్న గ్రూప్ 1 పరీక్షలు ఆటంకం లేకుండా తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. యథావిధిగా మెయిన్స్ పరీక్ష నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. ప్రిలిమ్స్‌ పై అభ్యంతరాలు, రిజర్వేషన్ల జీవో 33 ఇలాంటి పలు అంశాలపై హైకోర్టులో అభ్యర్థులు పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ ఇప్పటికే పూర్తి చేసిన హైకోర్టు తీర్పును మాత్రం నేటికి వాయిదా వేసింది. 


పిటిషన్లపై తుది తీర్పు వెల్లడించిన తెలంగాణహైకోర్టు ప్రిలిమ్స్ పై వేసిన పిటిషన్లుడిస్మిస్‌ చేసింది. మెయిన్స్ పరీక్షకు అడ్డంకులు తొలగించింది. అక్టోబర్ 21 నుంచి ఆరు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 


గ్రూప్ -1కు సంబంధించిన మెయిన్స్ పరీక్షల కోసం సోమవారమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హాల్‌టికెట్లు విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో ఈ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాస్తున్నారు.