Telangana DSC 2024:తెలంగాణ డీఎస్సీ పోస్టింగ్ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. సాంకేతిక సమస్యలతో కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్టు ఉదయం అధికారులు ప్రకటించారు. అయితే కాసేపటికే మళ్లీ అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు రావాలని అధికారులు ఫోన్లు చేసి చెప్పారు. వెంటనే వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌ ఆర్డర్లు అందజేశారు. 


జిల్లాల నుంచి డేటా సరిగా అందలేదని ఉదయం డీఎస్సీ అభ్యర్థులకు నిర్వహించాల్సిన పోస్టింగ్ కౌన్సెలింగ్‌ను అధికారులు వాయిదా వేశారు. అయితే జిల్లా డేటాను అందుకున్న అధికారులు ఆన్‌లైన్‌లో పెట్టడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో వాయిదా అని ప్రకటించిన కాసేపటికే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. 


మొన్న సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్న వారంతా పోస్టింగ్ ఆర్డర్స్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఆయా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేరుకొని ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్‌ అందుకున్నారు. వారికి వచ్చిన మార్లులు ర్యాంకులు ఆధారంగా వారికి స్కూళ్లను కేటాయించారు అధికారులు. వాటి ఆధారంగానే పోస్టింగ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఆయా స్కూల్స్‌లో జాయిన్ అయ్యేందుకు గడువు ఇచ్చారు. గడువులలోపు ఆయా స్కూల్స్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.