BRS confirms Majlis victory in Hyderabad local body MLC elections :  హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓటింగ్ కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యా బలం లేదు కాబట్టి బీఆర్ఎస్ నుండి అభ్యర్థిని నిలబెట్టలేదని ఆ  పార్టీ నేత కేటీఆర్ ప్రకటించారు.  బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ మద్దతివ్వదు.. ఎవరూ కూడా 24వ తేదీన ఓటు వేయకూడదని ప్రకటించారు. పోటీలో ఉన్న  ఎంఐఎం, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే.. ఎవరికీ మద్దతు ఇవ్వం, ఎవరికీ ఓటు వెయ్యమని ప్రకటించారు.  విప్‌ను ధిక్కరించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు వేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్‌ కు పూర్తి బలం
 
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు ఏకపక్షంగానే జరగనుంది.  హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం ఓట్లు  110 ఉన్నాయి. ఇందులో  81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నారు.  3 డివిజన్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికి  ఎంఐఎం పార్టీ బలం 49 ఓట్లు.  1 ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. 


మజ్లిస్‌కు కాంగ్రెస్ సపోర్టు 


గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలం 25 మాత్రమే.  3 రాజ్యసభ ఎంపీలు, 2 ఎమ్మె ల్సీలు, 5 ఎమ్మెల్యేలు, 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు.  బీజేపీ పార్టీ బలం   19 ఓట్లు.  1 ఎంపీ, 1 ఎమ్మెల్సీ, 19 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఈ పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో పోటీ అనివార్యమయింది.  కాంగ్రెస్ పార్టీ బలం  14 ఓట్లు మాత్రమే.  1 రాజ్యసభ ఎంపీ, 4 ఎమ్మె ల్సీలు, 2 ఎమ్మెల్యేలు, 7 కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ కు సపోర్టు చేయాలని నిర్ణయించింది.  ఎంఐఎం పార్టీ 49 ఓట్లతో బలంగా ఉండటం..  కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుండడంతో ఎంఐఎం పార్టీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. 



గెలుస్తామంటున్న బీజేపీ 


గెలవడానికి అవకాశం లేకపోయినప్పటికీ చివరి క్షణంలో బీజేపీ అభ్యర్థిని నలిబెట్టింది. గెలిచే అవకాశం లేకపోతే ఎందుకు నిలబెడతామని ప్రశ్నిస్తున్నారు. సీరియస్ గానే ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్గతంగా ఏమైనా ఆకర్ష్ ఆపరేషన్ చేశారో లేదో .. ఓటింగ్ రోజున తేలే అవకాశం ఉంది. ఎలాంటి ప్రయత్నాలు లేకపోతే మాత్రం.. మజ్లిస్ అభ్యర్థి సులువుగా గెలవడం ఖాయంగా కనిపిస్దోంది.  


మాములుగా అయితే బీజేపీ కన్నా మజ్లిస్ తో బీఆర్ఎస్ కు అనుబంధం ఎక్కువ. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మజ్లిస్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయింది. అందుకే ఆ పార్టీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు.