Hydra seizes TDP MLA Vasantha Krishna Prasad Lands :  ప్రతి వారాంతంలో విరుచుకుపడుతున్న హైడ్రా ఈ సారి  టీడీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసింది.  హఫీజ్ పేటలో ఉన్న  17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. అందులో ఉన్న మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ  పదిహేడు ఎకరాల విలువ రెండు వేల కోట్లకుపైగా ఉటుందని అంచనా. ఈ భూమిలో షెడ్లను నిర్మించి ఉన్నారు. సినిమా షూటింగ్‌లకు సంబంధించిన పరికరాలను నిల్వ చేశారు. షెడ్లను హైడ్రా అధికారులు కూలగొట్టారు.

వసంత కృష్ణ ప్రసాద్‌కు 39 ఎకరాల స్థలం            

హాఫిజ్ పేట సర్వే నెంబర్ 79లో వసంత కృష్ణప్రసాద్ కు 39ఎకరాల భూమి ఉంది. వాటిలో ఐదుఎకరాలను రైల్వే లైన్ విస్తరణ కోసం ఇచ్చారు. మిగిలిన పదిహేడు ఎకరాల్లో విల్లాలు కట్టి అమ్మారు. మిగిలిన భూమిని కూడా డెలవప్‌మెంట్ కు ఇచ్చారు. అయితే ఆ భూములు ప్రభుత్వానివన్న సమాచారం రావడంతో  హైడ్రా అధికారులు ఉదయమే బుల్ డోజర్లతో వచ్చి కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  2005లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని స్పష్టం చేశారు.  ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా తెలిపారు.          

భూమిపై ఫిర్యాదులు రావడంతో గతంలోనే పత్రాలు సమర్పించిన వసంత           

తమ భూమిపై ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలియడంతో గతంలోనే వసంత కృష్ణప్రసాద్ హైడ్రా  కమిషనర్ ను కలిశారు.  భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించారు.  కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీసు మొత్తాన్ని కూల్చేశారని వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద ఆనాటి ప్రభుత్వం నోటీసులు ఇస్తే తాను జరిమానా కట్టి క్రమబద్దీకరించుకున్నానని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇరవై ఏళ్లు అవుతోందని .. ఆ భూమిపై ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు. ఆ భూములు పైగా వంశస్థులవని.. ప్రభుత్వానికి కావన్నారు. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందన్నారు. కూల్చివేసిన ఆఫీసుల్లో కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి దేశంలో లేనప్పుడు ఇలా చేయడం ఏమిటని..ఆయన ఉండి ఉంటే కలిసి ఉండేవాడినన్నారు.         

తమ విచారణలో ప్రభుత్వ భూమిగా తేలిందన్న హైడ్రా                  

అయితే రంగనాథ్ మాత్రం హాఫీజ్ పేట సర్వేనెంబర్ 79/1  పూర్తి అక్రమం అని చెబుతున్నారు. ఆ భూమి మొత్తం ప్రభుత్వానిదేనని కాపాడాల్సిన బాధ్యత  ప్రభుత్వంపై ఉందన్నారు. హైడ్రా ఎంక్వైరీలో అది ప్రభుత్వ భూమి అనితేలిందన్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు.   

టీడీపీ ఎమ్మెల్యేలకు చెందిన  అత్యంత ఖరీదైన భూముల్లో హైడ్రా కూల్చివేతలు చెపట్టడం.. రాజకీయవర్గాల్లోనూ సంచలనంగామారింది.