HCU Lands Issue: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇదివరకే రాష్ట్రం నుంచి కేంద్రానికి, సుప్రీంకోర్టుకు విషయం వెళ్లగా ఆ భూములలో ఎలాంటి చర్యలు చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ భూములకు సంబంధించి ఫొటోలు, వీడియోలు షేర్ చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ సహా పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తనకు వచ్చిన నోటీసులపై స్మితా సబర్వాల్ స్పందించారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేసిన ఆమె.. బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చానంటూనే ఓ కీలక సందేహాన్ని లేవనెత్తారు. ఇది మరో వివాదానికి దారితీసేలా కనిపిస్తోంది. 

పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ విషయంపై క్లారిటీ అడిగారు. తాను షేర్ చేసిన పోస్టుకుగానూ నోటీసులు ఇచ్చారు ఓకే. అయితే తాను షేర్ చేసిన పోస్టును సోషల్ మీడియాలో 2 వేల మంది వరకు రీషేర్ చేశారు. వారందరిపై సైతం ఇదే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా స్మితా సబర్వాల్ సూటిగా అడిగారు. ఒకవేళ వారిపై అలాంటి చర్యలు లేవంటే.. తనను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని తేలిపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే, చట్టానికి ఎవరూ అతీతులు కాదనేది ఇక్కడ వర్తించడం లేదని స్పష్టమవుతోందని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

 

ఓ ట్విట్టర్ హ్యాండిల్ ఫోటో రీపోస్ట్  మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే X ఖాతాలో పోస్టు చేసిన ఓ ఫోటోను సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ రీపోస్టు చేశారు.  UoH లోపల ఉన్న మష్రూమ్ రాక్ ముందు ఒక నెమలి ,  ఒక జింక గిబ్లి శైలిలో బుల్డోజర్‌లను చూస్తున్నట్లు అందులో ఉంది. స్మితా సబర్వాల్ షేర్ చేసిన పోస్టు సోసల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు రెండు వేల మంది తాను షేర్ చేసిన పోస్టుపై స్పందించారని స్మితా సబర్వాల్ అంటున్నారు. మరోవైపు పోలీసులు ఇచ్చిన నోటీసులోని విషయాలను వెల్లడించడం లేదు. అయితే 400 ఎకరాల భూముల విధ్వంసంపై AI-జనరేటెడ్ ఫొటో షేర్ చేయడం  గురించి BNSS (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత) సెక్షన్ 179 కింద ఆమెకు నోటీసు ఇచ్చామని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. అయితే ఏఐ జనేటెడ్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. 

దాంతో అధికారులు ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసిన వారిపై చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ తో పాటు అలా పోస్టులు షేర్ చేసిన వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు.