Boy Dies At Swimming Pool: హైదరాబాద్: నగరంలోని ఓ స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో పదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈతకు వెళ్లిన బాలుడు స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోయి చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సమ్మర్ లో సరదాగా స్విమ్మింగ్ కు వెళ్లడమే ఆ బాలుడి పాలిట శాపంగా మారింది. ఈ కేసులో స్విమ్మింగ్ పూల్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.


ట్యూబ్‌లు ఇవ్వకపోవడంతో విషాదం.. 
చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధి నాగోల్ సమతపురి కాలనీలో బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నారు. లింగంపల్లి కి చెందిన విశ్వనాధ్, రేణుక దంపతుల పెద్ద కుమారుడు మనోజ్ (10) అనే బాలుడు వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అయితే పూల్ నిర్వాహకులు స్విమ్మింగ్ నేర్చుకునేందుకు వస్తున్న వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎలాంటి ట్రైనర్ లేకుండానే పూల్ నిర్వహించడం, పూల్‌లోకి దిగిన బాలురకు సేఫ్టీ కోసం ట్యూబులు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మనోజ్ నీళ్లలో పడిపోయి మరణించాడు. ఈతకు వెళ్లి చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


నీళ్లల్లో మునిగిపోయిన మనోజ్‌ను కొందరు పూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. బాలుడి ఛాతిపై నొక్కుతూ నీళ్లు బయటకు కక్కించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే బాలుడు మనోజ్ చనిపోయినట్లు గుర్తించారు. వేసవి సెలవులలో భాగంగా అమ్మమ్మ ఇంటికి వచ్చిన మనోజ్ చనిపోవడంతో తల్లిదండ్రులు ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈతకొలను (Swimming Polls)లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, బాలుడు మృతికి కారణమైన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన చైతన్యపురి పోలీసులు స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.


రెస్ట్ తీసుకుంటున్న ట్రైనర్..
వేసవి కావడంతో చిన్నారులు సరదాగా స్విమ్మింగ్ చేద్దామని స్విమ్మింగ్ పూల్స్‌కు వస్తుంటారు. అమ్మమ్మ ఇంటికి వచ్చిన మనోజ్ సైతం నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్‌కు వెళ్లాడు. ఈతకొలనులోకి దిగుతున్న బాలురికి ఎలాంటి ట్యూబులు ఇవ్వలేదు. పైగా చిన్నారులకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన ట్రైనర్ గదిలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడని, దాని వల్లే మనోజ్ ప్రాణాలు కోల్పోయాడని బాలుడి బంధువులు ఆరోపించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి స్విమ్మింగ్ పూల్స్‌ను క్లోజ్ చేయాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో కొన్ని చోట్ల వర్షాలు, అయినా తగ్గని వేడి - నేడు మరో 3 డిగ్రీలు అధికమే!


Also Read: Kissing Minor Boy: బాలుడి పెదాలపై ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం లైంగిక నేరమా? : బాంబే హైకోర్టు సంచలన తీర్పు