Rains in Hyderabad: ఎండ వేడి, తీవ్రమైన వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ వాసులకు ఉన్నట్టుండి ఉపశమనం లభించినట్లయింది. అప్పటిదాకా వేడిగాలులు వీస్తున్న హైదరాబాద్‌లో ఆకస్మాత్తుగా వర్షం పడింది. కానీ, ఆ చల్లదనం ఎంతోసేపు కొనసాగలేదు. కొన్ని ప్రాంతాల్లో నగర వాసులకు ఉపశమనం కల్పిస్తూ భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడిందనుకునేలోపే వర్షం మాయమై, సాధారణ స్థితి వచ్చేసింది. షేక్ పేట, గోల్కొండ, టోలీచౌకి, మెహెదీపట్నం, అత్తాపూర్, లంగర్ హౌస్‌ సహా ఎస్ఆర్ నగర్, మైత్రీవనం, ఎర్రగడ్డ, భరత్ నగర్ తదితర చోట్ల కూడా వర్షం కురిసింది. వర్షం ప్రభావంతో నగరంలో కాస్త వేడి తీవ్రత, ఉక్కపోత తగ్గాయి. ఆ వెంటనే అంతకుముందు ఉన్న వేడి పరిస్థితి నెలకొంది.






ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో మే 15న అక్కడకక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతాయని హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు అక్కడక్కడా క్రమంగా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ పెరుగుతుందని అంచనా వేసింది.




‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీల సెంటీ గ్రేడ్ నుంచి 24 డిగ్రీల సెంటీ గ్రేడ్ వరకూ ఉండే అవకాశం ఉంది. దక్షిణ నైరుతి దిశ ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది.’’ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేశారు.