టీఎస్‌పీఎస్సీ లీకేజీపై ప్రత్యక్షంగా పోరుకు సిద్ధమైంది బీజేపీ. అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న ఆ పార్టీ దీన్ని ఓ ఆయుధంగా మార్చుకుంటుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలపైనే అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆధారాలు సమర్పించాలని సిట్ విచారణకు పిలిచింది. అయితే పార్లమెంట్ సమావేశాలు కారణంగా తాను విచారణకు రాలేనని బండి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఇందిరాపార్క్ వేదికగా నేరుగా ప్రభుత్వంతో ఢీ కొట్టేందుకు సిద్ధపడ్డారు. 


మా నౌకరీలు మాగ్గావాలే అని నినాదంతో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో బీజేపీ నిరుద్యోగ మహాధర్నా చేపట్టనుంది. ఉదయం 11 గంటలకు ఈ ఆందోళన కార్యక్రమం ప్రారంభంకానుంది. ఉదయం 11 నుంచి మూడు గంటల వరకు ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాపై శుక్రవారం చాలా హైడ్రామా నిడిచింది. మొదట పోలీసులు ఈ నిరసనకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో అనుమతి ఇచ్చారు. కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 


మహాధర్నాతోపాటు మరిన్ని ప్రత్యక్ష పోరాటాలు చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ పేపర్ లీకేజీ అంశంతో ప్రభుత్వాన్ని వీలైనంత ఇరుకున పెట్టాలని పోరుబాట పట్టింది. ఇప్పటికే ఈ అంశంపై మాట్లాడిన బండి సంజయ్‌ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌దే తప్పంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, మొత్తం వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.


టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్‌ పాత్ర ఉందన్న ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని బండి సంజయ్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించింది. అయితే సిట్ విచారణకు హాజరు కాలేనంటూ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్య సిట్ విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించారు. తాను సిట్ ను నమ్మడం లేదని వివరించారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్ కు ఇవ్వదలుచుకోలేదని వెల్లడించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనకు నమ్మకం ఉన్న సంస్థలకు మాత్రమే సమాచారం ఇస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. తనకు సిట్ నోటీసులు అందలేదని... మీడియాలో వచ్చిన సమాచారం మేరకే తాను స్పందిస్తున్నట్లు వివరించారు. తాను కచ్చితంగా హాజరు కావాలని సిట్ అధికారులు భావిస్తే మరో తేదీ చెప్పాలని.. ఆ రోజు తాను కచ్చితంగా విచారణకు హాజరు అవుతానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 


ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకేజీ కేసుల్లో తనకు నోటీసులు ఇచ్చే ధైర్యం ఉందా అని సిట్ అధికారులపై సోమవారం బండి సంజయ్ చాలెంజ్ చేశారు. మంగళవారం ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రశ్నాపత్నాల లీకేజీ విషయంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని 24వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు చేసిన  టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను 23వ తేదీన ఆధారాలు తీసుకుని తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.