Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. శుక్రవారం భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 9వ రోజు కుమ్రం భీం జిల్లాలోని కెరిమెరి మండలం ధనోరా నుంచి మొదలై శివగూడ, గోయగాం, అంబరావుగూడ, కొఠారి, రాంనగర్, కొలం , వాడిగూడ, ఆడ, జండాగూడ గ్రామాల్లో కొనసాగింది.  ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు భూమి లేకుండా చేశారని జ్యోతిరావు పూలే వంశస్తులు ఆరోపించారు. జ్యోతిరావు ఫూలే చిత్రపటాన్ని భట్టి విక్రమార్కకు బహుకరించారు.  


"ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గంలో దాదాపుగా 65 వేల ఓటర్లు కలిగి ఉన్న మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని సీఎం కేసీఆర్ మోసం చేశారని" స్థానికులు వాపోయారు. తరతరాల నుంచి ఇక్కడే జీవిస్తున్న తమ భూములకు సంబంధించిన హక్కులను ధరణి ద్వారా తొలగించి అడవిలో హక్కు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ఆవేదన చెందారు. గోయగావ్ గ్రామానికి చేరుకోగా పారిశుద్ధ్య కార్మికులు శంకర్, రాజేషులు వచ్చి ఆరు నెలలుగా జీతాలు రావడంలేదని బీదరికంలో ఉన్న మాకు జీతం ఇవ్వకపోతే ఎట్లా బతకాలి? పిల్లల్ని ఎట్లా సాకాలి? అంటూ గోడు వెల్లబోసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఇదే బాధను  అనుభవిస్తున్నారని, అయినా ఈ ప్రభుత్వం వారిపట్ల కనికరం చూపకపోవడం బాధాకరమని భట్టి అన్నారు. ఇదే గ్రామానికి చెందిన షిండే సరస్వతి వచ్చి నేను కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్నప్పటికీ నా కొడుకు శుభం షిండేకు మంచి ఉద్యోగం వచ్చి జీవితంలో స్థిరపడాలని రాత్రింబవళ్లు మిషన్ కుడుతూ కోచింగ్ కు పంపిస్తే ప్రశ్నపత్రం లీకేజీ నా ఆశలను అంధకారం చేసిందని, తాను చచ్చిపోతే నా కొడుకు ఏ దిక్కు లేనోడు అవుతాడని భావోద్వేగానికి లోనై బోరున విలపించడంతో   భట్టి విక్రమార్క వారిని ఓదార్చారు. 


ఎండలో నడిచేస్తున్నావ్ అంటూ శివగూడ గ్రామానికి చెందిన రైతు శంకర్  తన పొలంలో నుంచి తీసుకువచ్చిన చెరుకు గడలను భట్టి విక్రమార్కకు ఇచ్చి జాగ్రత్తగా వెళ్లాలని చెబుతూ అభిమానాన్ని చాటుకున్నారు. కెరిమేరి మండల బీఎస్పీ అధ్యక్షుడు సీడం భీమ్రావు శివగూడ గ్రామంలో పాదయాత్రకు సంఘీభావం తెలిపి 9 తెగలకు చెందిన ఆదివాసులకు ఇండ్లు రాలేదని, భూపట్టాలివ్వలేదని, ఇంటింటికి ఇస్తామన్న మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వట్లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమి పట్టాలను కూడా ధరణిలో ఎక్కించకుండా ఆదివాసులను ఇబ్బందులు పెడుతున్నారని  చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగనే మా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్న భట్టి తో కలిసి అడుగులో అడుగులు వేశారు. ఆ తర్వాత గోయగావ్ చేరుకోగా ఇప్ప కిష్టాబాయి, సువర్కర్ రాధ, కనక మోయిన్బాయి, చిప్పకుర్తి గౌరీలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలేదని కాలనీకి తీసుకువెళ్లి చూపించారు. ఇప్పటికి ఊర్లో ఎవరికీ దళిత బంధు రాలేదని, మూడు ఎకరాల భూమి కూడా ఇవ్వలేదని, ఉన్న భూముల పట్టాలు తొలగించి మా భూమిపై వెళ్తే కేసులు పెడుతున్నారని గోడును వెళ్ళబోసుకున్నారు. 


అంబరావు గూడ గ్రామానికి చేరుకోగా టేకెం రాధా  నైడీ మైసక్క ఎదురొచ్చి రోజంతా కష్టపడితే 100 రూపాయల కైకిలు వస్తే ఏం తినాలి? పిల్లల్ని ఎట్లా సాకాలి? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పనిని కూడా బంద్ చేశారని ఆవేదన వెలిబుచ్చారు. ఉపాధి హామీ పని లేకపోవడంతో ఈ ఊరిలో ఉన్న మహిళలు పడుతున్న బాధలే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద కూలీలు అనుభవిస్తున్నారని, కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ పథకాన్ని కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.  కొలం కొఠారికి చేరుకున్న పాదయాత్ర వద్దకు ఆత్రం లక్ష్మి వచ్చి వడ్డీ లేని రుణాలు రావట్లేదని, పావల వడ్డీ ఇస్తలేరని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో  ఊరికి ఏమి రాలేదని, అప్పటి ఇందిరమ్మ రాజ్యమే మంచిగా ఉందని గుర్తుచేశారు. ఆత్రం లక్ష్మి  కోరుకుంటున్నట్టే రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు కోరిక ఇదేవిధంగా ఉన్నందున వారి  కోరిక నెరవేర్చడానికి ఎండను సైతం లెక్కచేయకుండా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్య స్థాపనకై ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఖమ్మం వరకు నడుస్తున్నానని భట్టి వెల్లడించారు.