BJP MLA Raja Singh | హైదరాబాద్: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ లో చేసిన నినాదాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటుగా స్పందించారు. ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో జై భీమ్, జై మీమ్, జై పాలస్తీనా అని అసదుద్దీన్ చేసిన నినాదాలపై తీవ్రంగా మండిపడ్డారు. భారత్ మాతాకీ జై,  జై భారత్ అని నినాదాలు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని రాజా సింగ్ సూటిగా ప్రశ్నించారు. ఏ దేశంలో ఉంటున్నావు, ఏ దేశంలో తిండి తింటూ, ప్రశాంతంగా బతుకుతున్నారో ఆ దేశానికి జై కొట్టడానికి ఎందుకు నోరు రావడం లేదంటూ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉంటే దేశం విడిచి వెళ్లిపోవాలని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


పాలస్తీనాపై అంత అభిమానం ఉంటే, వారి కోసం తాపత్రయం నిజం అయితే భారత్ విడిచి పాలస్తీనాకు వెళ్లిపోవాలని అసదుద్దీన్ కు సూచించారు. ఒక్కసారి పాలస్తీనాకు వెళితే అక్కడ నువ్వు ఏంటి, నీ పరిస్థితి ఏంటో సరిగ్గా అర్థమవుతుందంటూ రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో వేరే ఎంపీలు  అసదుద్దీన్ నినాదాలకు అడ్డు చెబితే బయటయకు వెళ్లి విదేశాలకు మనం వ్యతిరేకం అని ప్రచారం చేసే తరహా వ్యక్తి అన్నారు. మన దేశానికి ఇలాంటి వ్యక్తులు అవసరం లేదని, జై భారత్, భారత్ మాతాకీ జై అంటూ మాతృభూమిపై ప్రేమ ఉన్న వారికి ఇక్కడ చోటు ఉంటుందంటూ అసదుద్దీన్ కు బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.