BJP MLA Eatala Rajender criticises CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరికి సాయం చెయ్యాలి ఎవరికి చేయవద్దు అనే సోయి లేదు. వందల ఎకరాల బీడు భూములకు రైతు బంధు ఇస్తున్నారు. బెంజ్ కారులో వచ్చి చెక్కులు తీసుకుపోతున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో బడ్జెట్ మీద ఏర్పాటుచేసిన మేధావుల సదస్సులో పాల్గొన్న ఈటల రాజేందర్ పలు కీలక విషయాలు వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గొల్ల కురుమల కుటుంబంలో పుడితే చాలు ఎంత డబ్బున్న సరే వారికి గొర్లు ఇచ్చారు. 2 కోట్ల గొర్రెలు ఇస్తే 4 కోట్ల పిల్లలు పెట్టాయి, 6 కోట్ల గొర్రెలు అయ్యాయి అని కేసీఆర్ చెప్పే మాటలు పూర్తిగా అబద్ధమని, దళిత బంధు కింద ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కార్లు ఇస్తే నిజమైన పేదవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
మనకి నాలుగు రకాల నిధులు వస్తాయి:
1. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంలు,
2. 15th ఫైనాన్స్ కమీషన్ నిధులు, (తెలంగాణ ఏర్పడినప్పుడు: 2.95% నిధులు వస్తే.. 14th ఫైనాన్స్ కమీషన్ కింద 2.43% నిధులు
15 th ఫైనాన్స్ కమీషన్ 2.01% నిధులు వచ్చాయి.) పన్నుల్లో పగ పట్టారు అని కేటీఆర్ చెప్తున్న మాటలు శుద్ధ తప్పు. ఈ నిధులు ఫిక్సెడ్ ఉంటాయి అని ఆయన తెలుసుకోవాలి.
3. స్థానిక సంస్థల నిధులు.
4. బ్యాక్ వర్డ్ డిస్ట్రిక్ట్స్ నిధులు.
ఒకసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఒక్క రూపాయి కూడా అదనంగా రావు అని తెలిసి కూడా కేంద్రం నుండి డబ్బులు వస్తాయి అని బడ్జెట్ లో ప్రతిపాదన చేసి సీఎం కేసీఆర్ తెకలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. 2,95,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే .. అందులో 55 వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా రాదు అని తెలిసి కూడా బడ్జెట్ లో పెట్టి మభ్యపెడుతున్నారు. దీనివల్ల పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాల్లో కోత పెడతారు. మళ్లీ వీరి కళ్ళల్లో మట్టికొడతారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
టాంక్ బంద్ మీద విగ్రహాల కోసం పెట్టిన డబ్బులు కూడా ఎస్సీ సబ్ ప్లాన్ కింద పెట్టిన నిధులుగా చూపించారు. వారి ప్రయోజనం కోసం ఖర్చు చెయ్యలేదు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ ఉంటే GDP బాగా ఉండేది అన్నారు. కానీ కరోనా వచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయినా కూడా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంది అనే విషయం ఆయన గుర్తుంచుకోవాలి. ఇంగితజ్ఞానం కోల్పోయి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ప్రతిదీ ఎన్నికల కోణంలోనే మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు.
కేంద్రం బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండేచర్ ఎక్కువ పెడితే.. రాష్ట్రంలో అతి తక్కువ క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ పెట్టారని... ఇది తెలంగాణ పతనానికి నాంది అన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు GSDP లో అప్పు (77వేల కోట్లు)17 % ఉంటే ఇప్పుడు అది 38% (5 లక్షల కోట్లు)కు అప్పు పెరిగింది. సీఎం కేసీఆర్ అప్పు చేసి పప్పుకూడు తినిపిస్తున్నారని సెటైర్లు వేశారు. అదే కేంద్రం అప్పు 52% నుండి 49% కి తగ్గించారు. అంటే 3% తగ్గించారని వెల్లడించారు.
కరెంటు చార్జీలు ACD పేరుతో వసూలు చేస్తున్నారు. అడిషనల్ కంజెప్షన్ చార్జెస్ ఒక్కసారి కడితే అది తిరిగిరాదు. కాళేశ్వరం కరెంటు వాడకపోయినా 3500 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాల్సిందే నని గుర్తుచేశారు. సింగరేణి తెలంగాణ వచ్చినప్పుడు 5 వేల కోట్ల డిపాజిట్లతో కళకళలాడేదని, కానీ ఇప్పుడు 10 వేల కోట్ల అప్పుతో నెల నెలా జీతాల కోసం అప్పులు చేస్తుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు.