Minister KTR : వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలుడు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదరాబాద్ అంబర్‌పేటలో జరిగిన ఘటనలో నాలుగేళ్ల బాలుడి మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. నగరంలో వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు. ప్రతి మున్సిపాలిటీలో వీధి కుక్కల స‌మ‌స్యను  వీలైనంత తర్వగా ప‌రిష్కరించేందుకు ప్రయ‌త్నిస్తున్నామన్నారు.  దీని కోసం జంతు సంర‌క్షణ కేంద్రాల‌ు, జంతు జ‌న‌న నియంత్రణ కేంద్రాల‌ు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కుక్కల స్టెరిలైజేష‌న్ కోసం చ‌ర్యలు చేప‌డుతున్నామ‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ అంబర్‌పేటలో సోమవారం చోటుచేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న బాలుడిపై కుక్కలు నాలుగువైపులా కాపుకాసి దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు మృతిచెందాడు.  






వీధికుక్కల, కోతుల సమస్యపై సమావేశం 


హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విచారం వ్యక్తం చేశారు. బాలుడు ప్రదీప్‌ కుటుంబానికి  తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నగరంలో వీధి కుక్కలు, కోతుల సమస్యను పరిష్కరించేందుకు ఈనెల 23న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వీధి కుక్కలు, కోతుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్‌ఎంసీ, వెటర్నరీ అధికారులతో చర్చిస్తామన్నారు. వీధి కుక్కలు, కోతుల వల్ల మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తలసాని ఆందోళన వ్యక్తం చేశారు.


 విచారణకు ఆదేశం 


అంబర్‌పేట ఘటనపై జీహెచ్‌ఎంసీ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై చర్చించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులతో ఆమె అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు.


అసలేం జరిగింది? 


హైదరాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పిల్లలకు సెలవు కావడంతో.. పిల్లలను తనతో పాటు పని చేసే చోటుకి తీసుకెళ్లాడు. తండ్రి పని చేసుకుంటుండగా పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్క కాస్త దూరంగా ఉండడంతో నాలుగేళ్ల కుమారుడు అటువైపు వెళ్లాలనుకున్నాడు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన వీధి కుక్కలు బాలుడిపైకి పరిగెత్తుకొచ్చాయి. విషయం గుర్తించిన బాలుడి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వదలకుండా అతనిపై దాడి చేశాయి. మూడు కుక్కలు బాలుడి శరీర భాగాలను నోట కరుచుకొని ఒక్కోవైపుగా లాగడం మొదలు పెట్టాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. చే నంబరు చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ తో కలిసి బాగ్ అంబర్ పేట ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రోజు సెలవు కావడంతో పిల్లలిద్దరినీ వెంట బెట్టుకొని తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు ఆడుకుంటూ ఉండగా.. మరో వాచ్ మెన్ తో కలిసి గంగాధర్ వేరే ప్రాంతానికి వెళ్లాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్.. ఆ తర్వాత తన అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటూ ఇటూ పరుగులు తీశాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ కాలయముల్లా ఆ వీధి కుక్కలు బాలుడిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి.