JP Nadda Telangana Visit: బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెంచింది. ఈక్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ పర్యటనకు వచ్చారు. హైదరాబాద్ లోని నోవాలెట్ లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో కలిసి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, రఘునందర్ రావు, విజయశాంతి, వివేక్ తదితరులు పాల్గొన్నారు. అయితే మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాష్ట్రంలో పార్టీ పరంగా నాయకుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించనున్నారు. పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం కొరవడి బీజేపీ డీలా పడిందనే ప్రచారం మధ్య నడ్డా పర్యటన రాష్ట్రంలో పార్టీకీ కొత్త ఊపును ఇస్తుందని భావిస్తున్నారు. సంపర్క్ సే సమర్థన్ లో భాగంగా ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్ జయంత్ ల ఇళ్లకు వెళ్లి నడ్డా వారిని కలుసుకోనున్నారు.







జేపీ నడ్డా పూర్తి షెడ్యూల్ ఇదే..!


ఢిల్లీ నుంచి బయలుదేరిన జేపీ నడ్డా ఆదివారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.55 నుంచి 1.45 గంటల దాకా నోవాటెల్ హోటల్ లో రిజర్వ్ టైమ్ చేశారు. 2.30 గంటలకు టోలిచౌకిలోని ప్రొఫెసర్ నాగేశ్వర్ నివాసానికి వెళ్లి 15 నిమిషాలు ఆయనతో ముచ్చటిస్తారు. 2.55 నిమిషాలకు ఫిల్మ్ నగర్ లో పద్మశ్రీ ఆనంద్ శంకర్ జయంత్ లను కలుసుకుంటారు. 3.50కి నోవాటెల్ కు చేరుకుంటారు. 4.20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ కు బయలుదేరి 4.50కి అక్కడికి చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నాగర్ కర్నూల్ జెడ్పీ హైస్కూల్ మైదనంలో బహిరంగ సభలో పాల్గొంటారు. 6.15 గంటలకు హెలికాప్టర్ లో తిరుగు ప్రయాణమై 6.40కి శంషాబాద్ కు చేరుకుంటారు. 6.45 గంటలకు ప్రత్యేక విమానంలో కేరళలోని తిరువనంతపురంకు వెళ్తారు.