Bandla Ganesh: అన్నా వస్తున్నా.. అడుగులో అడిగేస్తా, చేతిలో చెయ్యేస్తా అంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. భట్టిని కలిసేందుకు సూర్యాపేట వెళ్తున్నట్లు వివరించారు. "కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నానంటూ" ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చారు.
గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ పార్టీ ఓఢిపోవడంతో రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ.. ఎలాంటి హడావుడి చేయలేదు. కానీ తాజాగా తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేయడం అందరిలోనూ ఆసక్తిని కలగజేస్తుంది.
మార్చి 16న పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించిన భట్టి విక్రమార్క
తెలంగాణలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా మార్చి 16న పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించారు. బోధ్ నియోజకవర్గం, పిప్పిరి గ్రామం నుంచి 83 రోజుల్లో అచ్చంపేట వరకు 957 కిలోమీటర్లు అనేక గ్రామాలు, పట్టణాలు, 30నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమై మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం కోసం కోరి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నమ చెబుతున్నారు. కానీ వాటిని సాధించలేకపోయామన్న నిరాశ, నిస్పృహలతో ఉన్నామని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని వివరించారు. ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న పోలీస్ వ్యవస్థ గురించి ప్రతి గ్రామంలో ప్రజలు నా దృష్టికి తీసుకు వచ్చిన అంశాలు బాధ కలిగించాయంటూ ప్రసంగాల్లో స్పష్టం చేస్తున్నారు.
పోలీసుల నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ ప్రజలు అడిగిన సంఘటనలు కోకొల్లలని అంటున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు పూర్తిగా ఎస్పీ, డీఐజీ, డీజీపీ ఉన్నతాధికారులతో డీలింక్ అయ్యి అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో పనిచేసే ఉద్యోగులుగా మారిపోయారన్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీ పోస్టింగ్ ల బదిలీలు, పదోన్నతులు అధికార పార్టీ శాసన సభ్యుల సిఫారసుల ప్రకారం జరుగుతుండటమే అందుకు కారణం అని పేర్కొంటున్నారు. పోలీసులు ప్రజా ప్రతినిధుల ఇష్టాలపై ఆధారపడి ఉండటం వల్ల బ్యూరోక్రాట్ విధానంలో ఉన్నత అధికారుల ఆదేశాలను పాటించకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలు అమలు చేయడమే ఉద్యోగ ధర్మంగా వారి పనితీరు మారింది.