మానసిక ఆరోగ్యం ఈరోజుల్లో ఎక్కువ మందిని ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక సమస్యలు, ఒత్తిడి వంటివి మానసిక ఆరోగ్యాన్ని దిగజారుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులలో సగానికి పైగా ఉద్యోగులు మానసిక సంబంధితమైన మందులను ఉపయోగిస్తున్నట్టు అధ్యయనం చెబుతుంది. కరోనా వైరస్ వచ్చాక ఉద్యోగుల పని అధికం అయినట్టు, దీనివల్ల వారు తీవ్ర ఒత్తిడి బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. పని ప్రదేశంలో పురుషులకంటే స్త్రీలే మానసికంగా అధికంగా ఒత్తిడికి గురవుతున్నారు. తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు, నిరాశ, ఆందోళన వంటి వాటి బారిన మహిళలే అధికంగా పడుతున్నారు. 


ఇలా మహిళలు నిరాశ, మానసిక ఆందోళనలో కూరుకుపోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకతలో ఒక ట్రిలియన్ డాలర్లు నష్టం ఏర్పడుతుందని గుర్తించారు. అందుకే ఉద్యోగుల మానసిక ఆరోగ్య సమస్యల గురించి కార్యాలయంలో యజమానులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతోంది. మానసిక ఆరోగ్యం అనేది ఉత్పాదకత పై చాలా ప్రభావం చూపిస్తుంది. మానసిక ఆరోగ్య సమస్యలు ఏ లింగానికి చెందిన వ్యక్తులనైనా ప్రభావితం చేయగలవు. అయితే మహిళా ఉద్యోగులు ఇంట్లోనూ, కార్యాలయంలోనూ ఉన్న ఒత్తిళ్ళను అధికంగా ఎదుర్కొంటున్న కారణంగా వారే ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. మహిళలపై ఇంటి పని, పిల్లలు, కుటుంబ సభ్యుల సంరక్షణ వంటి అదనపు బాధ్యతలు కూడా ఉంటాయి. వృత్తిపరమైన కట్టుబాట్లతో పాటు ఆ బాధ్యతలను సమతుల్యం చేయడానికి వారిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇదే ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది.


చాలాచోట్ల వర్క్ ప్లేస్ లో లింగ వివక్ష, లింగ పక్షపాతం కూడా కొనసాగుతుంది. ఇవి కూడా వారిలో నిరాశ, ఆత్మగౌరవాన్ని తగ్గించడం వంటి మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. వృత్తి, వ్యక్తిగత బాధ్యతలు రెండిటిని నిర్వహించలేక ఇబ్బంది పడుతున్న మహిళలు కూడా ఎంతో మంది ఉన్నారు. పిల్లలను చూడడానికి ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడం, వారి క్షేమం గురించి దిగులు పెట్టుకోవడం వంటివి కూడా వారిలో ఒత్తిడిని పెంచుతున్నాయి. కాబట్టి మహిళా ఉద్యోగులు శ్రేయస్సు కోసం కార్యాలయాలు మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.  


మానసికంగా బలహీనంగా ఉండే వారిలో కూడా మానసిక సమస్యలు త్వరగా వస్తాయి. ఎక్కువ మందికి చికిత్స తీసుకోవాలన్న ఆలోచన రాదు. మానసిక ఆందోళనలు తగ్గించుకోవడం కోసం మానసిక నిపుణుల సాయం తీసుకోవాలి. కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 



Also read: గట్టిగా నవ్వడంతో మీ రోజును ప్రారంభించండి, ఆరోగ్యపరంగా ఎన్నో అద్భుతాలు జరగడం ఖాయం



Also read: చీజ్ పౌడర్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు






























































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.