తెలంగాణాలోని విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోడంలేదంటూ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సిఎం కేసిఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వీరి సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం సరికాదంటూ లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
ఆర్టిజన్లు, ఉద్యోగుల పట్ల విద్యుత్‌ శాఖ యాజమాన్యం, రాష్ట్ర సర్కార్‌ కనీసం శ్రద్ధ చూపకపోవడం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీ ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని తెలియజేస్తోందని తెలిపారు.


జీపీఎఫ్‌, పీఆర్‌సీ వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 1999 నుండి 2004 మధ్య కాలంలో విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగం పొందినవారికి జీపీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌లు న్యాయబద్ధమైనవి అయినప్పటికీ ఎందుకు నెలల తరబడి జాప్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు బండి సంజయ్. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీరును లేఖలో విమర్శిస్తూనే సమస్య తీవ్రతను తనదైన శైలిలో కేసిఆర్ కు వివరించే ప్రయత్నం చేసారు సంజయ్.


తెలంగాణ ఉద్యమంలో విద్యుత్‌ శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని లేఖలో సంజయ్ తెలిపారు. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులు ఓకేతాటిపై పోరాటం చేయడంవల్ల తెలంగాణా సాధ్యమైయ్యిందనే విషయాన్ని లేఖలో స్పష్టం చేస్తూనే అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నా ఉద్యమంలో  ఉద్యోగులు చురుకుాగా పాల్గొన్నారని గుర్తు చేసారు. ప్రభుత్వ పాలనలో విద్యుత్‌ శాఖ అత్యంత కీలకమైనది. ఆర్టిజన్లు, విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెలోకి దిగితే మొత్తం రాష్ట్ర పాలనా యంత్రాంగమే కుప్పకూలుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీ ప్రభుత్వానికి మొదటి నుంచి చిన్నచూపే అంటూ ప్రభుత్వ తీరును ఎండట్టేగట్టారు.  ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయన్న సంజయ్. కొత్త పీఆర్‌సీ గురించి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని కేసిఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకొనే మీ ప్రభుత్వం ఉద్యోగులు కోరుతున్న నగదు రహిత మెడికల్‌ పాలసీకి ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు.


పదవీ విరమణ సహా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇన్సెంటీవ్‌లు, పీఆర్‌సీ, జీపీఎఫ్‌ వంటి సమస్యల విషయంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు, ఆర్టిజన్లతో చర్చలు జరపాలని బిజెపి డిమాండ్‌ చేస్తోందన్నారు బండి సంజయ్. వారి న్యాయమైన కోరికలు పరిష్కరించని పక్షంలో తెలంగాణ ఉద్యోగులు ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నానంటూ ముగిస్తూ ఉద్యోగుల సమస్యలపై తనదైన శైలిలో లేఖలో కేసిఆర్‌ ను నేరుగా ప్రస్తావిస్తూ సమస్య తీవ్రతను వివరించే ప్రయత్నం చేరారు ఎంపీ బండి సంజయ్.