ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ విచారించిన విధానంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మూడు వారాల తర్వాత విచారిస్తామని తెలియజేసింది. లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించాలని కోర్టు చెప్పింది. కవిత, ఈడీకి రెండు వర్గాలకు ఆదేశాలు ఇచ్చింది. కవిత తరఫున కపిల్ సిబాల్ వాదించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది.


ఈడీ తరపున విజయ్ మండల్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో పిటిషన్ దారు కోరుతున్న వెసులుబాటు పీఎంఎల్ఏ (Prevention of Money Laundering) కేసుల్లో వర్తిందని అన్నారు. ఈ చట్టం కింద విచారణకు పిలిచే అధికారం ఈడీకి ఉందని తెలిపారు.


కవిత తరపున సీనియర్ లాయర్ కవిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈడీ కార్యాలయానికి పిలిచే విషయంలో అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసులను ఓసారి పరిశీలించాలని అన్నారు. ‘‘ఈ కేసులో కవిత నిందితురాలు కాదు. సమన్ల విషయంలో ఈడీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాలేదు. చార్జిషీట్ ఇప్పటికే దాఖలు చేశారు. నళిని చిదంబరం కేసులతో దీన్ని ట్యాగ్ చేయండి’’ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.


ఈ సందర్భంగా అన్నింటినీ లోతుగా విచారణ చేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కేసులో చాలా కోర్ అంశాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. రాత పూర్వకంగా తమ వాదనలు సమర్పించాలని సుప్రీంకోర్టు కవిత, ఈడీ తరపు న్యాయవాదులను ఆదేశించింది.