Jagadgirigutta News : హైదరాబాద్ జగద్గిరిగుట్ట శివనగర్ లో దారుణం చోటుచేసుకుంది.  ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న అనిల్ అలియాస్ అనూష, గణేష్ ల సోమవారం ఉరివేసికుని బలవన్మరణానికి పాల్పడ్డారు. టాన్స్ జెండర్ అనూష, గణేష్ లు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు పోలీసులు.  


పెళ్లైన రెండేళ్లకే దారుణం 


జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ నగర్ లో దారుణం జరిగింది. పెళ్లైన రెండేళ్లకే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ కి చెందిన అనూష(25) ,గణేష్(25) ఇద్దరు జగద్గిరిగుట్ట శివ నగర్ లో నివాసముంటూ లేబర్ పనిచేసుకుంటున్నారు. సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.


ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య!


హైదరాబాల్ లో ఇటీవల మరో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం కుషాయిగూడ పీఎస్ పరిధిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం మొత్తం ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. 


అసలేం జరిగిందంటే? 


కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందిగూడలోని క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్ మెంట్స్ లో గాదె సతీష్ కుటుంబం నివాసం ఉంటోంది. సతీష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సతీష్ కు వేదతో దాదాపు పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి సంతానం ఇద్దరు పిల్లలు నిషికేత్ (9), నిహాల్ (5) ఉన్నారు. అయితే కొంతకాలం నుంచి ఇద్దరు పిల్లలకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ప్రాణంగా చూసుకుంటున్న పిల్లలను తరచు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని సతమతం అయ్యారు ఆ భార్యాభర్తలు. ఈ క్రమంలో సతీష్, వేద దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  


కుటుంబం మొత్తం చనిపోతే ఏ సమస్యా ఉండదనుకున్నారు. పిల్లల ఆరోగ్యం కుదుట పడటం లేదని, ఆత్మహత్యే వారికి పరిష్కారమని ఆవేదనతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో సతీష్, వేద దంపతులు ముందుగా పిల్లలు నిషికేత్, నిహాల్ లకు విషం (సైనెడ్) ఇచ్చారు. అనంతరం ఆ పిల్లల తల్లిదండ్రులు సైతం విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. గాదె సతీష్ (39), భార్య వేద (35), ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడిఉన్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. విషం తాగి సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబం మొత్తం ఆత్మహత్య (Family Commits Suicide) చేసుకుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. అయితే పిల్లల ఆరోగ్యం బాగుండటం లేదన్న కారణమేనా, ఇతర కారణాలతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు పోలీసులు.