Dalai Lama:


ధర్మశాలలో కార్యక్రమం..


దలైలామా చైనాకు గట్టి షాకే ఇచ్చారు. బుద్ధిజంలో మూడో అత్యున్నత పదవికి మంగోలియాకు చెందిన ఓ 8 ఏళ్ల బాలుడిని నియమించారు. అమెరికాలో పుట్టి పెరిగిన మంగోలియా బాలుడికి ఈ పదవి కట్టబెట్టడం సంచలనంగా మారింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు దలైలామా. 600 మంది మంగోలియన్ల సమక్షంలో ఈ విషయం వెల్లడించారు. ఖల్కా జెస్టన్ దంపా...ఈ బాలుడి రూపంలో మళ్లీ జన్మించారని అన్నారు. పదో ఖల్కా జెస్టన్‌ దంపాగా బాలుడిని నియమిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం దలైలామా వయసు 87 ఏళ్లు. తదుపరి దలైలామా ఎవరు అన్న చర్చ ఎంతో కాలంగా కొనసాగుతోంది. దీనిపై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టతనివ్వడం లేదు. ఈలోగా టిబెటన్ బుద్ధిజంలో కీలక పదవిగా భావించే స్థానంలో బాలుడిని కూర్చోబెట్టడం ఆసక్తికరంగా మారింది. ఆ బాలుడితో దలైలామా కలిసి ఉన్న  ఫోటో వైరల్ అవుతోంది. ఈ బాలుడు...మంగోలియా పార్లమెంట్ మాడీ సభ్యుడి మనవడు అని అక్కడి మీడియా వెల్లడించింది. ఈ నిర్ణయంపై చైనా మండి పడుతున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా దలైలామా, చైనా మధ్య ఘర్షణ కొనసాగుతోంది. తమ ప్రభుత్వం గుర్తించిన వ్యక్తినే బుద్ధిజం లీడర్‌గా పరిగణిస్తామని తేల్చి చెబుతోంది. కానీ దలైలామా మాత్రం చైనా డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. 


చైనాపై వ్యతిరేకత...


చైనా తదుపరి దలైలామాను ఎన్నుకునే యోచనలో ఉందన్న వార్త అలా బయటకు వచ్చిందో లేదో...వెంటనే బుద్ధ సంఘాలు తీవ్రంగా విమర్శలు మొదలు పెట్టాయి. దలైలామా ఎంపిక విషయంలో చైనా జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశాయి. భారత్‌లోని బౌద్ధ సంస్థలన్నీ ఇదే మాటను ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల బౌద్ధ సంఘాలు చైనాకు వ్యతిరేకంగా నిరనసలూ చేపడుతున్నాయి. తన తరవాత ఎవరు ఆ పదవిలో ఉండాలన్నది దలైలామా మాత్రమే నిర్ణయిస్తారని తేల్చి చెప్పాయి. అయితే అటు చైనా మాత్రం తరవాతి దలైలామాను ఎంచుకునే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఈ విషయంలో రాజీ పడేదే లేదని తేల్చి చెబుతోంది. నిజానికి...టిబెట్‌ చైనాలో 
భాగమే అని డ్రాగన్ ఎప్పటి నుంచో మొండిగా వాదిస్తోంది. అందుకే...దలైలామా విషయంలో తమ నిర్ణయమే నెగ్గాలని భావిస్తోంది. ఇదే సమయంలో దలైలామా మాత్రం స్వతంత్ర టిబెట్‌ కోసం ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి దలైలామాను ఎంపిక చేసుకోవడంలో చైనా విఫలమైతే...టిబెట్‌ను దక్కించుకోవడమూ అంత సులభం కాదు. అందుకే అంత పంతంగా ఉంది డ్రాగన్. మరోవైపు లద్దాఖ్ నుంచి ధర్మశాల వరకూ బౌద్ధ సంఘాలు చైనా వైఖరిని తప్పు బడుతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థలన్నీ చైనాకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దలైలామాను ఎంచుకునే హక్కు టిబెట్‌కే ఉంటుంది. ఈ మేరకు అమెరికా, టిబెట్ మధ్య ఓ ఒప్పందమూ కుదిరింది. చైనా మాత్రం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది. ఇలాంటి సమయంలో దలైలామా తీసుకున్న నిర్ణయం చైనాకు ఆగ్రహం కలిగించే అవకాశముంది. 


Also Read: సావర్కర్‌ను అవమానిస్తారా, మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం - రాహుల్‌పై ఠాక్రే ఆగ్రహం