కమిషన్ల కోసం తెలంగాణ విద్యార్థుల జీవితాలను సీఎం కేసీఆర్ కుటుంబం బలి తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం ఏబీవీపీ పోరాడుతుందని, కానీ బీఆర్ఎస్ నేతలు పోలీసుల సాయంతో ప్రజాస్వామ్యాన్ని అణచి వేస్తున్నారంటూ మండిపడ్డారు. కౌన్సెలింగ్ ప్రారంభం అవడానికి ముందే వేలాది సీట్లు అమ్ముకుంటూ విద్యార్థులను మోసం చేస్తున్నారని కొన్ని విద్యా సంస్థలపై ఆరోపణలు చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతో వేల మంది విద్యార్థులకు సీట్లు ఇచ్చి మోసం చేస్తున్న శ్రీనిధి, గురునానక్ సంస్థలపై పోరాటం చేసిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని బండి సంజయ్ పరామర్శించారు.  


శ్రీనిధి, గురునానక్ విద్యాసంస్థలు ప్రైవేటు యూనివర్సిటీలుగా అబద్ధపు ప్రచారం చేసుకుంటూ 4000 మంది విద్యార్థులను మోసం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేయడం కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం & విద్యార్ధుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ ని అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు లాకప్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని తెలంగాణ బిజెపి తీవ్రంగా ఖండించింది. దీనికి కారణమైన ఏసీపీ శివ మారుతి, ఇతర పోలీస్ సిబ్బంది మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ తరఫున బండి సంజయ్ డిమాండ్ చేశారు.






విద్యార్థులకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని బండి సంజయ్ ఆరోపించారు. దిల్​సుఖ్​నగర్‌లోని ఝాన్సీ నివాసానికి మంగళవారం వెళ్లి ఆమెను పరామర్శించారు. విద్యార్థుల జీవితాల కోసం పోరాటం చేస్తున్న ఏబీవీపీ మహిళా నాయకురాలిపై సైతం పోలీసులతో దాడి చేయించడం, అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దుర్గార్గమైన చర్యగా అభివర్ణించారు. గురునానక్‌, శ్రీనిధి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఏబీవీపీ వినతిపత్రాలు ఇవ్వాలని వెళితే వారిపై భౌతికదాడులు చేయడం సబబు కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు.


సీఎం కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు ఇవ్వడం కాదు కదా, కనీసం స్కూల్, కాలేజీ విద్యార్థుల ఎగ్జామ్స్ సైతం సరిగ్గా నిర్వహించంలో విఫలమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు. మొదట టీఎస్ పీఎస్సీ నియామక పరీక్షల పేపర్ల లీక్ లకు మంత్రి కేటీఆర్ కారణం అన్న ఆయన.. ఆపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజీ కేసులో తనను అన్యాయంగా ఇరికించే కుట్ర చేశారని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఉన్నత విద్య చదవాలనుకున్న విద్యార్థులకు అనుమతి లేకున్నా, ముందుగానే అధిక సీట్లు అమ్మి విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.