Bandi Sanjay Calls for Protest Against TSRTC Prices Hike: బండి సంజయ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై ఆందోళనలకు ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా సంజయ్ జేబీఎస్‌లో ప్రయాణికులతో ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ జేబీఎస్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసుల యత్నించారు. బస్ ఛార్జీల పెంపుపై ధర్నాలు చేసి తీరుతామన్న బీజేపీ నేతలు చెబుతున్నారు. ఛార్జీల పెంపుపై నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు. ప్రజల బాధలు తెలుసుకోవడం నేరమా?, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు.. అరెస్టులు, అణిచివేతలతో ఉద్యమాలను ఆపలేరు అంటూ పోలీసులపై బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు.






జిట్టా అరెస్టుపై ఆగ్రహం


బీజేపీ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేయడంపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులివ్వకుండా అర్ధరాత్రి ఎలా కిడ్నాప్ చేసి తీసుకెళ్తారని మండిపాడ్డారు. వెంటనే జిట్టాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిట్టాకు ఏం జరిగినా కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులే పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ అన్నారు. అయితే, జిట్టా బాలకృష్ణా రెడ్డిని పోలీసులు ఎక్కడికి తీసుకు వెళ్లారనే దానిపై క్లారిటీ లేదు.


గురువారం (జూన్ 9) అర్ధరాత్రి పోలీసులు ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఉన్నట్టుండి అరెస్టు చేయడం ఏంటని జిట్టా పోలీసులను ప్రశ్నించారు. అయినా ఆయన మాటను పట్టించుకోకుండా పోలీసులు బలవంతంగా జిట్టా బాలకృష్ణా రెడ్డిని అరెస్టు చేశారు.


జూన్ 2వ తేదీన జిట్టా బాలకృష్ణా రెడ్డి ‘అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’ అని ఓ సభ నిర్వహించారు. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కించపరిచేలా ఓ నాటకం (స్కిట్) చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు జిట్టాను గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు.