Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయని.. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తాము గెలిచామని, వచ్చే ఎన్నికల్లో కూడా కచ్చితంగా తామే గెలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు మాత్రమే అనుకుంటే సరిపోదని.. ప్రజలు కూడా అనుకోవాలని అన్నారు. డిపాజిట్లు ఏ పార్టీ కోల్పోతుందనే విషయం అందరికీ తెలుసంటూ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు.
రాష్ట్రంలో జరిగిన హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని... ఈ తరహాలోనే వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని వివరించారు. బీజేపీ గెలిచిన విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ నేతలు అద్దాల మేడలో ఉంటూ సంతోష పడుతున్నారని విమర్శలు చేశారు. ఈ మేరకు నోవాటెల్ లోని హోటల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలనను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గమనిస్తోందని బండి సంజయ్ వివరించారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీకీ ఓటేసి గెలిపిస్తే.. వారు బీఆర్ఎస్ లోకి వెళ్తారనే వాళ్లను గెలిపించట్లేదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని.. నేరుగా జానారెడ్డియే చెప్పారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో 18 మందిని గెలిపిస్తే 12 మంది బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలువొద్దని కేసీఆర్ గట్టిగా కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన వాళ్లంతా ఎలాగూ బీఆర్ఎస్ లోకి వస్తారని పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ ను పైకి లేపుతున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న చోట 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు వేల కోట్ల పాకెట్ మనీ ఇచ్చి కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు.
ఇటీవలే బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై బండి సంజయ్ ఆరోపణలు
రాష్ర్టపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రతిపాదించినప్పుడు ఆమెను ఓడించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రయత్నించాయని, కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఆర్థిక సాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ర్టంలో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వస్తుందని తెలిసే సీఎం కేసీఆర్ మళ్లీ కాంగ్రెస్ పార్టీని పైకి లేపాలని చూస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీని ఎంత లేపిన లేచే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇప్పుడు ప్రధాని మోదీని తన మిత్రుడిగా ఎందుకు చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. బీజేపీ సిద్ధాంతాలను, మోదీ నాయకత్వాన్ని నమ్మి పార్టీలోకి వచ్చే వారిని తాము స్వాగతిస్తామని అన్నారు. ఎవరో రావాలని తాము చూడట్లేదని అన్నారు. బీజేపీలోంచి కొంత మంది వెళ్లిపోతున్నారంటూ సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని అన్నారు. బీజేపీ నుంచి ఎవరూ వెళ్లిపోవడం లేదని స్పష్టం చేశారు. 45 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని అనడం హాస్యాస్పదమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనడాన్ని తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని, అధికారంలోకి వచ్చేది కూడా తమ ప్రభుత్వమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial