TRS News: ఈటల రాజేందర్ మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. వార్డు మెంబర్ గా కూడా లేని ఈటలను మంత్రిగా చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ విశ్వాస ఘాతకుడని, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారని ఎద్దేవా చేశారు. 2004 కు ముందు ఈటల అడ్రస్ ఎక్కడ అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఓ ఏక లింగం బోడి లింగంలా మారారు. ఈటల శిఖండి రాజకీయాలు చేస్తున్నాడు. ఆరోగ్య మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఈటల అవినీతికి పాల్పడ్డాడు. కమ్యూనిస్టు కమ్యునలిస్టుగా మారారు. హుజూరాబాద్ లో ఈటల ఓటమి ఖాయం. అందుకే గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు.
ఈటల కేసీఆర్ పై పోటీ చేసే సిపాయా? ఈటల ఓ చెల్లని రూపాయి. పబ్లిసిటీ కోసమే ఈటల తంటాలు. బీజేపీలో ఈటలది బానిస బతుకు. వరదల్లోనూ బీజేపీ కండువాలు కప్పుతూ బురద రాజకీయం చేస్తోంది. ఈటల వంటి శిఖండిలు తెలంగాణ కంట్లో నలుసులా మారారు. కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ ద్రోహుల తయారీ కర్మాగారాలుగా మారాయి. పదవులు రాజకీయాలు తప్ప బీజేపీ కాంగ్రెస్ లకు ఈ వరదల్లో ప్రజల ఘోష పట్టడం లేదు.
‘‘ఈటల లాంటి వారు పేకాటలో జోకర్లుగా మారారు. బీసీ, ఎస్సీల భూములు కబ్జా చేసిన నీచ చరిత్ర ఈటలది. ఈటల చిట్టాను బయటకు తెస్తాం. కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతాం. బీజేపీ అవినీతి పరులు క్రిమినల్స్ కు అడ్డాగా మారారు. ఈటల ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. నోరు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఈటల దమ్ముంటే మళ్ళీ హుజూరాబాద్ లోనే పోటీ చేసి గెలవాలి. ఒడిపోతాననే తెలిసి ఈటల కొత్త పల్లవి అందుకున్నారు. హుజురాబాద్ లో మొన్న ఈటల కాంగ్రెస్, రేవంత్ ల సాయంతో గెలిచారు. కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈటల హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఈటల ఎక్కువ మాట్లాడితే తెలంగాణ సమాజం ఆయన నాలుక చీరేస్తుంది.
ఈటల విష పురుగు - బాల్క సుమన్
‘‘ఈటల నల్లికుట్ల రాజకీయాలు నడవవు. తెలంగాణ రాజకీయాల్లో ఓ విష పురుగు ఈటల. మంత్రిగా ఉన్నపుడు కాళేశ్వరం ను అద్భుత ప్రాజెక్ట గా పేర్కొన్న ఈటల ఇపుడు పార్టీ మారి తిడుతున్నారు. 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈటల అంటున్నారు. కనీసం వార్డు మెంబర్ కూడా టచ్ లో లేరు. రాబోయే రోజుల్లో బీజేపీ నుంచే టీఆర్ఎస్ లో చేరికలుంటాయి.
‘‘ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ‘‘ఈటలది వ్యాపార నైజం.. ఆయనకు ఏ సిద్ధాంతం లేదు. గజ దొంగ పార్టీలో ఈటల చేరి నీతులు చెబుతున్నారు. అనామకుడైన ఈటలను సీఎం కేసీఆర్
మంత్రి చేశారు. బీజేపీ తెలంగాణ లో ఎదగడానికి అవకాశం లేదు. బీజేపీ తెలంగాణలో సింగిల్ డిజిట్ దాటదు. మోదీ రెండు నెలలు హైదరాబాద్ లో ఉన్నా ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడు. దమ్ముంటే ఈటలతో టచ్ లో ఉన్న వారి పేర్లు బయట పెట్టాలి. తెలంగాణ లో ప్రభుత్వాన్ని పడగొట్టడం మోదీ జేజమ్మ తరం కూడా కాదు.
ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. ‘‘2004 లో కమలాపురం సీటును 32 మంది ఆశించినా కేసీఆర్ ఈటల కు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఈటల అహంకారంతో బడుగు బలహీన వర్గాల దొరలా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఈటలది కాదు. మంత్రిగా ఈటల బీసీలకు ఏం చేయలేదు. తండ్రిలాంటి కేసీఆర్ ను ఈటల విమర్శిస్తే తగిన శాస్తి తప్పదు’’ అని అన్నారు.