Heavy Rains in hyderabad: భాగ్యనగరంలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా భారీ వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ బిడీల్ కాలనీ, వనస్థలిపురం గౌతమి నగర్, నాగోల్ అయ్యప్ప కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. అలాగే పలు చోట్ల చెట్టు విరిగి పడిపోయాయు. విషయం తెలుసుకున్న హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఏఈతో కలిసి కాలనీలను సందర్శించారు. వెంటనే డీఆర్ఎఫ్ బృందాన్నిపిలిపించి సహాయక చర్యలు ప్రారంభించమని చెప్పారు. ఈ కాలనీలో ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
పూర్తిగా నీటిమయం అయిన కాలనీలు..
పాతబస్తీ, బహదూర్ పురా, కిషన్ బాగ్, రైన్ బజార్, యాకుత్ పురా, కాలా పత్తర్, ప్రాంతాల్లొ గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి భారీ వరదలు పోటెత్తాయి. దీంతో రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. అలాగే ఉప్పల్ లోని పద్మావతి కాలనీలో భారీగా వరద నీరు చేరి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా చేస్తోంది. అడుగు తీసి అడుడు బయట పెట్టాలంటేనే ప్రజలు గజగజా వణికిపోతున్నారు. కనీసం నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు కూడా బయటకు రాలేకపోతున్నారు.
ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తిన అధికారులు..
ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ కు వరద ఉద్ధృతి పెరుగుతూ వస్తోంది. దీంతో ఈరోజు ఉదయం 9 గంటలకు 6 గేట్లను 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తారు. మొత్తం ఔట్ ఫ్లో 1872 క్యూసెక్కులుగా ఉంది.
ట్రాఫిక్ పోలీసుల ప్రకటన..
- భారీ వర్షం, వరదలు తగ్గే వరకు నగర ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
- ట్రాఫిక్ ను తగ్గించేందుకు పీక్ అవర్స్ లో రోడ్డు పైకి రాకూడదని సూచించారు.
- వరద నీళ్లలోకి అస్సలే వెళ్లకూడదు.
- పిల్లలను బయట ఆడుకునేందుకు పంపించడం మంచిది కాదు.
- ట్రాఫిక్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా, సమస్య ఉన్నా 85004111111 నెంబర్ ను సంప్రదించలచ్చు. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపవచ్చు.
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
హైదరాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో అర్ధ రాత్రి భారీ వర్షం కురిసింది. నేడు సైతం నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. గంటకు 6 నుంచి 12 కి.మీ వేగంతో చల్లని గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గత 20 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యలో ఓ రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. వర్షాకాలం ప్రారంభంలోనే ఇంత ఎత్తున వర్షాలు కురవడం ఇదే ప్రథమం. భారీ వర్షాల ధాటికి పంటలన్నీ నీట మునిగాయి. చాలా మంది ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. ప్రాజెక్టులు, నదుల సమీపంలో ఉండే ప్రజలు ఇబ్బందులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.