ఓవైపు ‘ఈటల’లాంటి మాటలు మరోవైపు ఢీ కొట్టే బండితో తెలంగాణలో అధికారపార్టీకి వ‌ర్షాకాలంలో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నార‌ని బీజేపీ శ్రేణులు సంబరప‌డిపోతున్నాయి. అయితే ఇలాంటివన్నీ మామూలే అంటూ టీఆర్‌ ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి. కానీ ఎక్కడో కారులో కంగారు మొదలైందన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇంతకీ తెలంగాణలో గులాబీని గుచ్చుకుంటున్న ముళ్లు ఏంటీ అన్నదే ఆసక్తికరమైన చర్చ.


ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నా ముందస్తుగానే తెలంగాణలో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ పోరు రోజురోజుకూ మలుపులు తిరుగుతోంది. ఇంట్రస్టింగ్ థ్రిల్ల‌ర్ సినిమాలాగా ప్రతీ క్షణం.. ఇరు పార్టీలు సస్పెన్స్‌ తో రోజుకో విషయాన్ని బయటపెడతామంటూ సవాల్‌ చేస్తున్నాయి. 


నిన్నగాక మొన్న బండి సంజయ్‌ త్వరలో ఈడీ విచారణకు తెలంగాణ సీఎం వస్తారంటూ ప్రకటించారు. డేట్‌ చెప్పలేదు కానీ దొరకి ముందుటుందని అసలు పండగ అంటూ కామెంట్‌ చేశారు. దీనికి కేటీఆర్‌ కూడా బండిని ఈడీ ఛైర్మన్‌ చేసినందుకు కృతజ్ఞతలంటూ ప్రధాని మోదీకి ట్వీట్‌ చేశారు. అలాగే ప్రజాగోస- బీజేపీ భరోసా అంటూ కాషాయం మొదలెట్టిన బైక్‌ ర్యాలీ, బండి సంజయ్‌ పాదయాత్రపైనా కేటీఆర్‌ తనదైన స్టైల్లో పంచ్‌ విసిరారు.


ఈ ట్వీట్‌కి బీజేపీ కూడా తనదైన మార్క్‌ని చూపించింది. నిన్నటివరకు కాస్తంత ఆచితూచి మాట్లాడిన ఈటల రాజేందర్‌ ఇప్పుడు మాత్రం డోస్ పెంచారు. అంతేకాదు కేసీఆర్‌ని ఈటల్లాంటి మాటలతో టార్గెట్‌ చేశారు. త్వరలో కారు దిగి కాషాయం కప్పుకునే నేతలు చాలామందే ఉన్నారని పేర్లతో సహా బయటపెట్టే సమయం అతి త్వరలోనే ఉందన్నారు. 


నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసిన తర్వాత కమలం పార్టీలోకి వస్తామని చెప్పారని, ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌కి భారీ షాక్‌ ఇచ్చేందుకు అసంతృప్తి నేతలంతా రెడీగా ఉన్నారని ఈటల రాజేందర్‌ చెప్పడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


కొన్ని రోజుల క్రితమే టీఆర్‌ఎస్‌లో కట్టప్పలున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై కెసిఆర్‌ కూడా తన దైన స్టైల్లో స్పందించారు. అయితే ఇప్పుడు ఈటల మాటలతో కట్టప్పలున్న మాట వాస్తమేనని మరోసారి రుజువైందంటున్నారు రాజకీయవిశ్లేషకులు.


నో ప్రాబ్ల‌మ్...నో ప్రాబ్ల‌మ్. కేసిఆర్ ఉన్నారుగా...


అయితే ఎన్నికల టైమ్‌లో నేతలు పార్టీలు మారడం సహజమే. జంపింగ్‌ జపాంగ్లు కూడా ఎక్కువే. అధికారం ఆశ చూపిస్తే ఎవరైనా పార్టీ మారుతారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ని బట్టే జంపింగ్‌ లు ఉంటాయన్నది ఓ రీజన్‌. ఇంకొకటి ఎమ్మెల్యేలని చూసి ఓట్లేసే రోజులు పోయాయన్నది. అంతకుముందు కేసీఆర్ తెలంగాణ తెచ్చారని సీఎంని చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో అభివృద్ధి బాటలో తెలంగాణని నడిపించడమే కాకుండా బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పడంతో ప్రజలు ఆయన మాటని విశ్వసించి గెలిపించారు. ఇప్పుడు కూడా కేసీఆర్‌ ని చూసే ఓట్లు వేస్తారు కానీ ఎమ్మెల్యేలను కాద‌ని కొంద‌రి ఎమ్మెల్యేలు అనుకుంటున్నారంట‌.


అభివృద్దే ఎజెండాగా... 


మరి ఈ లెక్కన ఈటల మాటలు కేసీఆర్‌ కి షాకిస్తాయా అంటే డౌటే అంటున్నారు టీఆర్‌ఎస్‌ శ్రేణులు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పాలన చూసే ఓట్లేస్తారని ధీమాతో చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఐటీ కంపెనీలు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందు ఉందని గుర్తు చేస్తున్నారు. కాబట్టి టీఆర్‌ఎస్‌కి నేతలు కటీఫ్‌ చెప్పినంత మాత్రాన నష్టపోయేది వాళ్లే కానీ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలాంటి ఢోకా లేదంటున్నారు. అలాగే కేసీఆర్‌ నాయకత్వానికి వచ్చే ఇబ్బంది లేదంటున్నారు. అస‌లు లెక్క‌లు తొంద‌ర‌లోనే తేలుతాయంటున్నారు కాషాయనాయ‌కులు.