ఎందుకు సీఎం కేసీఆర్ ఈ పనులు.. అంటూ విపక్షనేతల కాదు ఇటు సొంత పార్టీ వాళ్లే విమర్శిస్తున్నారు. ఇంతకీ కేసీఆర్‌ చేసిన పనేంటి.. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటారా. ఈ వివరాలపై ఓ లుక్కేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి ఎన్నికల్లో 110 సీట్లలో పోటీ చేసిన టీఆర్ఎస్ 63 సీట్లు సాధించడంతో సాధారణ మెజార్టీతో కేసీఆర్‌ కొత్త రాష్ట్ర తొలి సీఎం అయ్యారు. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లి సంచలన ఫలితాలు రాబట్టారు కేసీఆర్. 2018లో ముందస్తుకు వెళ్లి 88 సీట్లలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించారు. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఆ తరువాతే టీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్ మొదలైంది.


లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆశించిన విధంగా సీట్లు రాలేదు. సీఎం కేసీఆర్‌ కూతురు కవిత సైతం నిజామాబాద్‌లో ఓడిపోవడం వారికి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే తొలిసారి దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో గెలుపు టీఆర్‌ఎస్‌ దే అన్న ధీమాతో ఉన్న కేసీఆర్‌‌కు ప్రజలు షాకిచ్చారు. తిరుగుబాటుతో కారు వదిలి కాషాయం కప్పుకున్న రఘునందన్‌ రావుని గెలిపించారు. ఇక అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీకి బైపోల్‌ భయం పట్టుకుంది. ఉప ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో వరాలు కురిపిస్తూ వస్తోంది. కానీ మళ్లీ నిరాశే ఎదురైంది.


హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో నిరాశే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లోనూ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. పార్టీ నుంచి బయటకొచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ని ఓడించాలన్న కసితో ఉన్న సీఎం కేసీఆర్‌ బైపోల్‌ ఎన్నికలకు ముందు దళితబంధు పథకాన్ని (Dalit Bandhu Scheme) అమలు చేశారు. దీనిపై విమర్శలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ముందస్తుగా ఈ పథకాన్ని హుజురాబాద్‌ నుంచే స్టార్ట్‌ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కొన్ని అభివృద్ధి పనులకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇక్కడ సైతం ఓటమి తప్పలేదు. 


సాగర్‌లో నెగ్గినా, రీజన్ అది కాదు !
ఇక నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలు కూడా రసవత్తరంగానే సాగాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నానాకష్టాలు పడి గెలిచిన టీఆర్‌ఎస్‌ కి అదే సమయంలో నాగార్జున సాగర్‌ బైపోల్‌ కీలకంగా మారింది. బీజేపీ దూకుడును అడ్డుకోవాలని, దుబ్బాకలో పుంజుకున్న కాంగ్రెస్‌‌ను అడ్డుకోవాలన్న ప్లాన్‌ తో  బై పోల్స్‌ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ప్రతి గ్రామానికి రూ.20లక్షలు, మండల కేంద్రానికి రూ.30లక్షల అభివృద్ధి నిధులు కేటాయించారు. అయితే నోముల నర్సింహయ్యకి ప్రజల్లో మంచి పేరు ఉండటంతో ప్రజలంతా ఆయన కొడుకు, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ ని గెలిపించారే కానీ కేసీఆర్‌ హామీలను చూసి కాదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవి గెలుపును కూడా టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు పేరిట  కార్యక్రమాలు నిర్వహించడమే కాదు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించింది. పీవీ ఘాట్‌ అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది. దీంతో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుని ఓడించి పరువు నిలుపుకుందన్న మాటలు వినిపించాయి.


ఇక ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక తథ్యమన్న వార్తల నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా 13 మండలాలను ప్రకటించింది ప్రభుత్వం. మునుగోడు నియోజకవర్గంలో గట్టుప్పల్‌ మండలం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. ఇప్పుడా దిశగా మార్పులు జరగడంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాటలు నిజమేనని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మంత్రి జగదీశ్‌ రెడ్డిని మునుగోడు వ్యవహారాలు చూడాల్సిందిగా ఇప్పటికే  కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్‌ లో ఉన్న సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను అతి త్వరగా అందివ్వాల్సిందిగా జగదీశ్‌‌కు సూచించినట్లు సమాచారం. 


అయితే ఇలా ఉప ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, హామీల వల్ల పార్టీకి మేలు జరగడం లేదన్న వాదనలు టీఆర్ఎస్‌లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాన్నే వారు పార్టీ అధిష్టానం వద్ద ప్రస్తావిస్తున్నారట. హామీల వర్షం కురిపిస్తేగానీ అతికష్టం మీద బైపోల్స్‌ లో గెలవాల్సి వస్తుందని సెంటిమెంట్‌‌ని గుర్తు చేస్తూ  కేసీఆర్‌‌ని కొందరు నేతలు హెచ్చరిస్తున్నారు. ఎప్పటిలాగానే అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్ అసాధ్యమైన హామీలు గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి గెలవాలని చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మేలు చేసి ఉంటే, ఉప ఎన్నికలు అనగానే హామీల వర్షం కురిపించాల్సిన అవసరం లేదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. బై పోల్స్ వస్తే కేసీఆర్ పార్టీకి బైబై చెప్పేయాలంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.