Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ వినాయకుడు లడ్డూ వేలం పాట కాసేపట్లో ప్రారంభంకానుంది. దీని కోసం ఇప్పటికే అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం ఆరు గంటలకు ఆఖరి పూజ పూర్తి చేసుకున్న వినాయకుడు బాలాపూర్‌లో ఊరేగింపుగా నిమజ్జనానికి కదులుతున్నారు. ఊరి చివరకు వచ్చేసరికి భారీ జనసందోహం మధ్య వేలం పాట నిర్వహిస్తారు. 


ఈసారి అమల్లోకి వచ్చిన కొత్త రూల్ ప్రకారం లడ్డూ వేలంలో పాల్గొనే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. పోటీ పడే వారి సంఖ్య తగ్గిందే తప్ప పోటీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. గతేడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈసారి 30లక్షలుపైమాటే అంటున్నారు స్థానికులు. 


అందుకే బాలాపూర్ లడ్డూ వేలం ఎప్పుడు ప్రారంభమవుతుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆసక్తి కేవలం హైదరాబాద్‌ వాసులకే కాకుండా తెలుగు ప్రజలందరికీ ఉంటోంది. వేలాంలో ఇంతకంటే భారీ రేటు పలికిన వినాయక లడ్డూలు ఉండొచ్చేమో కానీ బాలాపూర్‌ లడ్డూ మాత్రం వాటన్నింటి కంటే చాలా స్పెషల్. 


2024లో బాలాపూర్ లడ్డూ వేలంలో మాత్రం కేవలం నలుగు వ్యక్తులే పాల్గొనబోతున్నారు. కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం గతేడాది లడ్డూ వేలం ధరను ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వారినే వేలం పాడుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకే వేలం పాడే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 


ఈ ఏడాది బాలాపూర్ కమిటీ పెట్టిన రూల్‌  ప్రకారం నలుగురు వ్యక్తులు మాత్రమే గతేడాది లడ్డూ వేలం ధరను డిపాజిట్ చేశారు. గతేడాది 27 లక్షలకు లడ్డూ అమ్ముడుపోయింది. ఆ 27 లక్షల రూపాయలను కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే కమిటీ వద్ద డిపాజిట్ చేశారు. వారే ఈసారి బాలాపూర్ లడ్డూ దక్కించుకోవడానికి పోటీ పడనున్నారు.  


Also Read: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా


కర్మన్ ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్, సాహెబ్ నగర్ అర్బన్ గ్రూప్‌కు చెందిన సామా ప్రణీత్ రెడ్డి, పోచారం ఎస్ వై ఆర్ ఫౌండేషన్ చెందిన సందీప్ రెడ్డి, బాలాపూర్ గ్రామానికి చెందిన బిజెపి నేత కొలన్ శంకర్ రెడ్డి, మాత్రమే 27 లక్షల చొప్పున కమిటీ వద్ద డిపాజిట్ చేశారు. దీంతో వాళ్లు మాత్రమే ఈసారి వేలంలో పాల్గొంటున్నారు. 


అందుకే ఈ నలుగురిలో ఒకరికి ఈసారి బాలాపూర్ లడ్డూ దక్కనుంది. పోటీ పడే వాళ్లు తక్కువ మందే ఉన్నప్పటికీ పోటీ మాత్రం రసవత్తరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. నలుగురి మధ్య పోటీ చాలా ఎక్కువ ఉంటుందని ప్రతిష్టాత్మంగా భావించి ఎవరూ తగ్గేదేలే అన్నట్టు పాట పాడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అది 30 లక్షలకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.  



బాలాపూర్‌ వినాయకుడు నిమజ్జనానికి శోభాయాత్రగా వెళ్లనున్నారు. దీని కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బాలాపూర్ గణనాథ శోభాయాత్రపై ఒక డీసీపీ,ఒక అడిషనల్ డీసీపీ నలుగురు ఏసీపీలు,12 మంది సిఐలు,26 మంది ఎస్ఐలు 2008 మంది పోలీస్ సిబ్బందితో పాటు రాపిడి యాక్షన్ ఫోర్స్,పార మిలిటరీ బలగాలు,స్పెషల్ పార్టీ పోలీసులు కన్నేసి ఉంచారు. వీళ్లతోపాటు 30 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. 


Also Read: బాలాపూర్‌ లడ్డూ వేలంలో కొత్త రూల్‌- ఆ డబ్బు డిపాజిట్ చేస్తేనే పాటలో పాల్గొనే ఛాన్స్