Balapur Laddu: వినాయక చవితి వేడుకలు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్‌ గణేష్‌ ఎంత ఫేమస్సో... బాలాపూర్ లడ్డూ కూడా అంతే ఫేమస్. అందుకే నిమజ్జనం వేళ ఈ రెండింటిపైనే అందరి ఫోకస్ ఉంటుంది. భారీ గణపయ్యలను ఏర్పాటు చేసే ఖైరతాబాద్‌ వినాయకుడిని గంగ ఒడికి చేర్చే వరకు భక్తులు చాలా ఆసక్తిగా చూస్తుంటారు. ఆ ప్రక్రియను భక్తితో ఆస్వాదిస్తుంటారు. రికార్డు స్థాయిలో వేలం ధర పలికే బాలాపూర్ లడ్డూ గురించి కూడా అంతే ఆసక్తితో ఆరా తీస్తుంటారు. 


ఈసారి రికార్డు స్థాయి ధర


ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలికే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. 450 రూపాయలతో మొదలైన ఈ లడ్డూ ధర ప్రతి యేడూ లక్షల రూపాయల ధర పలుకుతోంది. గతేడాది 27 లక్షలకు భక్తులు ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఎంత ధరకు వెళ్తుందనే ఆసక్తి చాలా మందిలో ఉంది. అందుకే ఆ క్రతువు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న బాలాపూర్‌ వినాయక పూజాకమిటీ ఈసారి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. పేరు కోసం కొందరు పాటల్లో పాల్గొంటున్నారని గ్రహించిన కమిటీ సభ్యులు ఈసారి రూల్స్ మొత్తం మార్చేశారు. లడ్డూ వేలం పాడాలంటే గతంలో పలికిన ధర డబ్బులను డిపాజిట్ చేయాలనే రూల్ తీసుకొచ్చారు. 


27 లక్షలు డిపాజిట్ చేస్తేనే


గతేడాది ఎంతకు లడ్డూ అమ్ముడుపోయిందో అంత డబ్బులు పూజాకమిటీ వద్ద డిపాజిట్ చేస్తేనే లడ్డూ వేలంలో పాల్గొనే ఛాన్స్ కల్పిస్తారు. అంటే గతేడాది 27 లక్షలకు లడ్డూ అమ్ముడుపోయినందున... ఈ సంవత్సరం 27 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్లనే వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తారు. దీని వల్ల ఆ స్థోమత లేని వాళ్లు పాల్గొనేందుకు వీలు లేకుండా చేశారు. దీని వల్ల గందరగోళం తగ్గిపోతుందని పూజాకమిటీ చెబుతోంది.



ఇప్పుడు అయోధ్య రామాలయం సెట్‌లో బాలాపూర్‌ గణేషుడిని ఉంచారు. ఈ గణపతిని దర్శించుకునేందుకు వేల మంది భక్తులు ఇక్కడకు వచ్చి పూజల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ గణేషుడిని మండపం నుంచి కదలించారు. బాలాపూర్‌లో ఊరేగిస్తున్నారు. అక్కడి నుంచి గ్రామ శివారకు తీసుకొచ్చి అక్కడే లడ్డూ వేలం వేస్తారు. ఈసారి 30 లక్షలకుపైగానే లడ్డూ వేలంలో పోతుందని అందరూ అంచనా వేస్తున్నారు. 


1994 నుంచి వేలం 


1980 నుంచి బాలాపూర్‌ గణేషుడికి లడ్డూను నైవేద్యంగా పెడుతున్నప్పటికీ వేలం ప్రక్రియ మాత్రం 1994లో మొదలైంది. తొలిసారి నిర్వహించిన వేలంలో ఓ భక్తుడు 450 రూపాయలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నాడు. అలా మొదలైన బాలపూర్ లడ్డూ వేలం ప్రతి ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది 21 కిలోల లడ్డూ 27 లక్షలకు దాసరి దయానంద్‌ రెడ్డి వేలం పాడుకున్నారు. అయితే ఇప్పుడు ఎవరికి దక్కుతుంది.... ఎంత ధర పలుకుతుందనే ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ ప్రక్రియ తెలిసిన ప్రతి ఒక్కరిలో ఉంది. 


Also Read: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా