Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు, విశేషాలు, రికార్డులతో దూసుకుపోతుంది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేషుడు గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి బడా గణేష్ మహా నిమజ్జనానికి సంబంధించిన ఉత్సవ సమితి సన్నాహాలు ప్రారంభించింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు మహాగణపతి చివరి పూజలు అందుకోనున్నారు. అనంతరం భారీ క్రేను సాయంతో మహాగణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అనంతరం తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు మహాగణపతిని భారీ వాహనంపై ఎక్కించి వెల్డింగ్ పనులు ప్రారంభిస్తారు. అనంతరం ఆరు గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది.
శోభాయాత్ర ఇలా సాగనుంది
శోభాయాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు మహా గణపతి ట్యాంక్‌బండ్‌లోని క్రేన్ నంబర్ 4కి చేరుకుంటుంది. అనంతరం భారీ వాహనం నుంచి మహాగణపతి విగ్రహాన్ని దించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. క్రేన్ నంబర్ 4 వద్ద ఉదయం 10.30 గంటలకు పూజలు ప్రారంభించి.. 12, 1 గంటలకు మహాగణపతి నిమజ్జనం పూర్తవుతుంది. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. కాగా, హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసుల ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కి.మీ. శోభాయాత్ర కొనసాగనుంది.అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సేవలు అందించనున్నట్లు మెట్రో ప్రకటన చేసింది.
భారీ ఆదాయం
ఇక ఖైరతాబాద్ బడా గణపతికి ఈసారి ఎన్నడూ లేని విధంగా హుండీ ఆదాయం వచ్చిందని గణేష్ ఉత్సవ కమిటీ వెల్లడించింది. మంగళవారం నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగిన హుండీ లెక్కింపులో కళ్లు చెదిరే ఆదాయం వచ్చిందని ఉత్సవ కమిటీ ప్రకటించింది. హుండీ ఆదాయం మాత్రమే కాదు, ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా కూడా డబ్బు సమకూరుతుంది. మరోవైపు ఖైరతాబాద్ మహా వినాయకుడికి యాడ్స్ ద్వారా కూడా లక్షల్లో ఆదాయం వచ్చిందని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇక తొమ్మిది రోజులుగా ఖైరతాబాద్ మహా వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు భారీగా నగదు, కానుకలు సమర్పించారు. ఈ క్రమంలోనే ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కానుకల ద్వారా ఏకంగా రూ. 70 లక్షలకు పైగా హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తాజాగా తెలిపింది. వీటితోపాటు హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు సమకూరినట్లు పేర్కొన్నారు. ఇవేకాకుండా.. వినాయకుడి విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా కూడా విరాళాలు కూడా వచ్చాయని.. అయితే వాటిని ఇంకా లెక్కించాల్సి ఉందని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
భారీగా బస్సు సర్వీసులు
గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. గణేశ నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల సమాచారం కోసం రైతిఫైల్ బస్ స్టేషన్ - 9959226154, కోఠి బస్ స్టేషన్ - 9959226160 నంబర్‌లను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.