Ganesh Nimajjanam Precautions & Guidelines: ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలే..కానీ పెద్ద సమస్యలు రాకుండా ఆపేస్తాయి.. 


సింథటిక్ దుస్తులు వద్దు


నిమజ్జనంలో పాల్గొనేవారు సింథటిక్ దుస్తులు వేసుకోవద్దు. విపరీతమైన రద్దీతో సింథటిక్ దుస్తులు అత్యంత అసౌకర్యంగా ఉంటాయి. పైగా క్రాకర్స్ సందడి ఉండనే ఉంటుంది..ఆ సమయంలో చిన్న నిప్పు రవ్వ చిమ్మినా ప్రమాదమే. అందుకే ఒంటినిండా ఉండే కాటన్ దుస్తులు మాత్రమే ధరించండి. మరీ ముఖ్యంగా క్రాకర్స్ ఎవరైతే వెలిగిస్తున్నారో వారికి దూరంగా ఉండండి...పేల్చిన క్రాకర్స్ మీద పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. క్రాకర్స్ కాల్చే వారుకూడా ఎదుటి వారికి ఎలాంటి ప్రమాదం తలపెట్టకుండా మీరు ప్రమాదంలో పడకుండా జాగ్రత్తపడండి. వళ్లంతా నిండుగా ఉండే దుస్తులు ధరించండి.


Also Read: ఏపీ, తెలంగాణలో ఈ ప్రాంతాల్లో నిమజ్జనం అదిరిపోతుంది!


పిల్లల్ని తీసుకెళ్లొద్దు


చాలామంది సరదా పేరుతో వాళ్లతో పాటూ పిల్లల్ని కూడా నిమిజ్జనానికి తీసుకెళుతుంటారు. సరదా, సందడి పిల్లలకు తెలియజేయడం, పాల్గొనేలా చేయడం మంచిదే కానీ.. విపరీతమైన రద్దీ ఉండే ప్రదేశంలో పిల్లల్ని తీసుకెళితే వారి సరదా మాట దేవుడెరుగు..ఆ తర్వాత బాధపడాల్సి ఉంటుంది. పొరపాటున చిన్న తొక్కిసలాట జరిగినా చిన్నారుల్ని నిలువరించడం అత్యంత కష్టమైన విషయం. అందుకే నిమజ్జనం వేడుకలను టీవీల్లో చూపించండి కానీ ఆ రద్దీలోకి పిల్లల్ని తీసుకెళ్లి ప్రమాదానికి దగ్గర చేయవద్దు. జాగ్రత్తగా తీసుకెళతాం పర్వాలేదు అనుకుంటే గణేష్ నిమజ్జనం జరిగే సమయంలో నీటి దగ్గరకు పోనీయ్యవద్దు. పొరపాటున జారి పడినా వాళ్లు గట్టిగా అరిచినా మీకు వినిపించే పరిస్థితి కూడా ఉండదు. అందుకే పిల్లల్ని తీసుకెళ్లొద్దు..తీసుకెళ్లినా నీటివైపు పోనీయకండి. 


విలువైన వస్తువులు తీసుకెళ్లొద్దు


బంగారం వస్తువులు, ఖరీదైన వాచ్ లు, ఫోన్లు..నిమజ్జనం సందర్భంగా తీసుకెళ్లకుండా ఉండడమే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని తీసుకెళ్లినా జాగ్రత్తగా భద్రపరచండి..ఎవ్వరికీ అప్పగించవద్దు. మీ వస్తువుల భద్రత మీదే. ఎందుకంటే రద్దీ ప్రదేశాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు..ఆ విషయం మర్చిపోవద్దు


Also Read: గణేష్ నిమజ్జనం సమయంలో చేయాల్సినవి చేయకూడనివి ఇవే!


అర్థరాత్రి వరకూ ఉండిపోవద్దు


నిమజ్జనం సందడంతా సాయంత్ర సమయంలోనే ఉంటుంది. ఎంత ఆలస్యంగా వేడుకలు మొదలైనా కానీ కాస్త త్వరగా పూర్తిచేసేలా ప్లాన్ చేసుకోండి. అర్థరాత్రి వరకూ నిమజ్జనం సందడిలోనే ఉండిపోవద్దు. వీలైనంత తొందరగానే వేడుకలు ముగించుకుని ఇంటికి చేరుకునేందుకు ప్రయత్నించండి. 


మరీ లోపలకు వెళ్లొద్దు


నిమజ్జనం సందర్భంగా ఆయా ప్రదేశాల వద్ద క్రేన్ లు ఏర్పాటు చేస్తారు..వాటి ద్వారా విగ్రహాలను నీటి లోపలకు దించండి. మీరే స్వయంగా గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చాలన్న ఉద్దేశంతో మరీ లోపలకు వెళ్లిపోవద్దు. ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించలేం...అంతా జరిగిన తర్వాత బాధపడేకన్నా ముందే తగిన జాగ్రత్తలు పాటించండి. నిమజ్జన ప్రదేశంలో అధికారులు,పోలీసులు విధించిన నిబంధనలు పాటించండి. 


Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!


కాలుష్య కోరల్లో చిక్కుకోవద్దు
 
నిమజ్జనం సమయంలో ఎక్కువ సమయం నీటిలోనే ఉండిపోవద్దు. ఇప్పుడంతా కాలుష్య మయం. నీటిలో ఆక్సిజన్ శాతం కూడా తక్కువే ఉంటోంది. అందుకే వీలైనంత తొందరగా నిమజ్జనం చేసేసి తొందరగా ఇంటికెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి..ఎక్కువ సేపు నీటిలో ఉండిపోతే చర్మ సమస్యలు తప్పవు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు కూడా వేడుకలలో పాల్గొనడం అంత మంచిదేం కాదు. అందుకే ఊపిరితిత్తులు, చర్మ సంబంధిత సమస్యలున్నవారు దూరం నుంచి చూసి ఆనందించడమే మంచిది.