ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ వేగవంతం అయింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఇద్దరు పెద్ద వ్యాపారులను తాజాగా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని, మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును కూడా ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఈడీ వర్గాలు ప్రకటించాయి. శరద్ చంద్రారెడ్డి, వినోయ్ బాబులకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో అరబిందో గ్రూపు డైరెక్టర్ పెన్నాక శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.
అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి డైరెక్టరుగా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా కూడా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌ను కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్ లో చేర్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెనాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ ఆర్టికల్ ఇంకా అప్ డేట్ అవుతుంది)