Munugode Elections: పరాన్న జీవిలా మారిన టీఆర్ఎస్- రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

Munugode Elections: మునుగోడులో టీఆర్ఎస్ ది కేవలం సాంకేతిక విజయం మాత్రమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ పరాన్న జీవిగా మారిందని అన్నారు.

Continues below advertisement

Munugode Elections: మునుగోడులో టీఆర్ఎస్ ది సాంకేతిక విజయం మాత్రమేనని అభిప్రాయపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. తెలంగాణలో టీఆర్ఎస్ గెలవదని కేసీఆర్ స్వయంగా ఒప్పుకుని కమ్యూనిస్టుల సహకారం తీసుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ పరాన్న జీవిగా మారిందని అన్నారు. మునుగోడు బై ఎలెక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ పరాయి వ్యక్తులపై, శక్తులపై ఆధారపడి గెలిచిందని ఆక్షేపించారు. కమ్యూనిస్టుల సహకారంతోనే టీఆర్ఎస్ విజయం సాధించిందని ఆరోపించారు. 

Continues below advertisement

"మునుగోడులో బీజేపీ బరితెగించింది"

వందల కోట్లు పంచిపెట్టి దేశంలోనే మునుగొడును తాగుబోతు నియజకవర్గంగా నిలబెట్టారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 20రోజుల్లో 300 కోట్ల రూపాయల మందును తాగించారని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రజలను తాగుబోతులుగా మార్చాయంటే అక్కడి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని పీసీసీ చీఫ్ తెలిపారు. చుక్క మందు పోయకుండా కాంగ్రెస్ 24 వేల ఓట్లు పొందడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను మూడో స్థానానికి నెట్టడానికి చాలా మంది బీజేపీ నాయకులు తిష్ట వేశారని విమర్శలు చేశారు.

"ఇంతకంటే సిగ్గుచేటు దేశంలో ఉందా?"

దేశానికి నాయకుడిని అవుతానన్న కేసీఆర్.. సొంత కాళ్లపై నిలబడలేకపోయారంటూ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. "కమ్యూనిస్టుల సహకారంతో గెలిచిన టీఆర్ఎస్ గెలుపు ఒక గెలుపేనా? వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి అభ్యర్థిని కొనుక్కున్న మోదీకి సామాజిక స్పృహ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ఖతం అయిందని మోదీ ప్రకటించడం దిగజారుడుకు పరాకాష్ట. ఓటమిని సమీక్షించుకోకుండా కాంగ్రెస్ సఫా అయిందని మోదీ సంబరపడుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మిత్రులే అని మోదీ ప్రకటనతో నిరూపితం అయింది. డబ్బు, మద్యం కలిసి ఎన్నికల్లో తెలంగాణ సమాజాన్ని ఓడించాయి. దేశానికి ఎన్నికల సంఘం అవసరం లేదని మునుగోడు ఉపఎన్నికతో నిరూపితమైంది. ఎన్నికల సంఘం ఉన్నా ఉపయోగం లేదు. మునుగోడు ఉపఎన్నికల్లో వచ్చిన ఓట్లతో కాంగ్రెస్‌పై ప్రజల్లో మమకారం తగ్గలేదని అర్ధమైంది" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

"తెలంగాణలో భారత్ జోడో యాత్రలో రాహుల్‌ను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. చారిత్రక కట్టడం చార్మినార్ మీదుగా యాత్ర అద్భుతంగా సాగింది. రాచరిక విధానాలపై పోరాటం చేయడానికి రాహుల్ కార్యోన్ముఖులై కదిలారు. దేశంలో సమస్యలపై కొట్లాడాలని ఆలోచనతో రాహుల్ ముందుకు కదిలారు. కాగడాల ప్రదర్శనతో కాంతి రేఖలు నింపుతూ మహారాష్ట్ర గడ్డపై జోడో యాత్ర అడుగు పెట్టింది. పాదయాత్రలో అందరికీ భరోసా ఇస్తూ రాహుల్ గాంధీ ముందుకు కదిలారు. ప్రపంచంలో ఇంత అద్భుతమైన సన్నివేశం ఎక్కడా కనిపించదు. భారత్ జోడో యాత్రతో రాహుల్ ఒక నూతన శకానికి తెర లేపారు. దేశం ప్రమాదకర పరిస్థితిలోకి నెట్టివేయబడుతున్న సమయంలో రాహుల్ ఒక భరోసాగా కనిపించారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సందర్భం ఇది. పీసీసీ అధ్యక్షుడిగా నా బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించాను. ప్రజల్లో భరోసాను నింపేందుకు, జోడో యాత్ర స్పూర్తితో మళ్లీ ప్రజల ముందుకు వస్తాం. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన కార్యచరణతో ప్రజల్లోకి వెళుతుంది టీఆరెస్, బీజేపీ వైఖరిని ప్రజలకు వివరించేందుకు ఒక కార్యచరణతో ముందుకొస్తాం" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Continues below advertisement