Asaduddin Owaisi on One nation One Election: కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న దిశగా దేశమంతా ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించే అంశాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం మరో అడుగు వేసిన సంగతి తెలిసిందే. సంబంధిత రిపోర్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల విషయంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఓ కమిటీని కొద్ది నెలల క్రితం నియమించగా.. తాజాగా నివేదికను సమర్పించింది. ఆ నివేదికను ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నివేదికను గతంలో రాష్ట్రపతికి కూడా రామ్ నాథ్ కోవింద్ సమర్పించారు. ఇందులో వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానాలకు అనుకూలంగా ఆయన ప్రతిపాదనలు చేశారు. తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై బిల్లులు పెట్టి ఆమోదింపచేసుకుంటే.. ఇక జమిలీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది.
అయితే, బీజేపీ మిత్ర పక్షాలు అన్నీ జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉండగా.. విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్‌తోపాటు కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. దేశ ప్రజలు దీన్ని అంగీకరించబోరని చెప్పారు. ఎన్నికల సమస్యలు సృష్టించి ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని ఆరోపించారు. ‘ఒక దేశం-ఒకే ఎన్నికలు’ ఆచరణాత్మకం కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజాగా ఒకే దేశం - ఒకే ఎన్నికలు అంశంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇది ఆచరణాత్మకం కాదని అన్నారు. ఎక్స్ వేదికగా స్పందించిన హైదరాబాద్ ఎంపీ ఇలా స్పందించారు. దేశంలోని ఫెడరలిజాన్ని నాశనం చేయడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని రాజీ పడేలా చేయడం వల్లే తాను ఒకే దేశం - ఒకే ఎన్నికను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వేర్వేరు సమయాల్లో జరిగే ఎన్నికలు మోదీ, షాలకు తప్ప మరెవరికీ ఇబ్బంది కాబోవడం లేదని అన్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నందునే ఇలా చేస్తున్నారని చెప్పారు. సక్రమంగా, ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్య జవాబుదారీతనం కూడా మెరుగుపడుతుందని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు.