CM Revanth Released On New MSME Policy: ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంఎస్ఎంఈ పాలసీ - 2024ని (MSME Policy - 2024) బుధవారం విడుదల చేశారు. 'చాలామంది విద్యార్థుల్లో డిగ్రీలు ఉన్నా పరిశ్రమలకు తగిన నైపుణ్యం ఉండడం లేదు. విద్యార్థుల్లో స్కిల్ అప్‌గ్రెడేషన్ చేయడానికి కృషి చేస్తున్నాం. నూతన విధానాలు రూపకల్పన చేయకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదు. పరిశ్రమలకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలను చెల్లిస్తాం. కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో కూడా తెలంగాణ ముందుంది. ఐటీ, ఫార్మా అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది. ప్రతి ఏడాది లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. అందరికీ ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నాం.' అని సీఎం పేర్కొన్నారు.


అందుకే నూతన పాలసీ


ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు MSMEలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రేవంత్ తెలిపారు. 'రాష్ట్ర సంపదను పెంపొందించాలనే MSME పాలసీ-2024ను ఆవిష్కరించాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయం. గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే... కొత్త పాలసీని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలను తొలగించేందుకు మా ప్రభుత్వం వెనక్కు తగ్గదు. రాష్ట్రంలో 65 ఐటీఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం. టాటా ఇనిస్టిట్యూట్‌తో కలిసి సంయుక్తంగా రూ.2400 కోట్లతో ఆధునీకరిస్తున్నాం. పూర్తి అధ్యయనం తరువాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం అందించేలా యువతకు శిక్షణ ఇందులో శిక్షణ ఇవ్వనున్నాం. యూనివర్సిటీ నిర్వహణకు పారిశ్రామికవేత్తల నుంచి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నాం. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి వ్యవసాయం పండగ అని నిరూపించాం. ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేయబోతున్నాం. MSMEలు బలపడితేనే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. MSMEలకు మా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది.' అని పేర్కొన్నారు.


'ప్రపంచంతో పోటీ పడేలా..'


దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు పీవీ నరసింహారావు చేసిన కృషిని మనం జ్ఞాపకం చేసుకోవాలని.. ప్రపంచంతో పోటీ పడేలా ఆయన ఆర్థిక విధానాలు తీసుకొచ్చారని సీఎం రేవంత్ తెలిపారు. పీవీ ప్రధాని అయ్యాక సరళీకృత విధానాలు వచ్చాయని అన్నారు. 'విధానాల రూపకల్పనలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదు. యువతలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల పెంపు కోసం కృషి చేస్తున్నాం. యువతకు వ్యవసాయం, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తాం. వ్యవసాయ రంగంలో యువత ఎదిగేలా ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయం అనేది దండగ కాదు.. పండగ అనేది మా ప్రభుత్వ నినాదం. రూ.18 వేల కోట్ల నిధులు విడుదల చేసి రైతుల రుణాలు తీర్చాం. తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరాకును తలపిస్తోంది. పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, ఆర్థిక సాయం అందిస్తాం. మూసీ నది వీక్షణకు పర్యాటకుల సంఖ్య పెరిగేలా అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలను ఎంతో మెరుగుపరుస్తున్నాం.' అని సీఎం వివరించారు.


Also Read: Telangana : ఎస్సీ, ఎస్టీలకు పరిశ్రమల స్థాపనలో ప్రోత్సాహం - తెలంగాణ MSME పాలసీలో కీలక విషయాలు