Airport Metro :  రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు చేపట్టనున్న మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు శుక్రవారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత రాజేంద్రనగర్ పోలీస్ గ్రౌండ్స్‌లో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాదాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐటీ హబ్‌గా గుర్తింపు ఉన్న గచ్చిబౌలి-మాదాపూర్-కొండాపూర్-మైండ్ స్పేస్ టెక్నాలజీ పార్కులకు రాకపోకలు సాగించడానికి వీలుగా దీన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ఆయా ప్రాంతాల నుంచి మెట్రో రైలు ద్వారా అతి తక్కువ సమయంలో నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకోవచ్చు. ప్రపంచ స్థాయి పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎయిర్ పోర్టుకు మెట్రో అనుసంధానం చేస్తున్నారు. 


ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఎయిర్‌ పోర్టు మెట్రో 


ఎయిర్ పోర్టు మెట్రో విశేషాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టు 31 కిలోమీటర్లు నిర్మించబోతున్నామని.. దీని కోసం మొత్తం రూ.6250 కోట్ల ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాయదుర్గం నుండి ఎయిర్ పోర్ట్ వరకు ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశామని..భూసేకరణ ఇబ్బంది లేదని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. సిటీ మెట్రో ప్రస్తుతం స్పీడ్ మినీమమ్ 35 కిలోమీటర్ ఫర్ అవర్ ఉందని, మాక్సిమమ్ 80 కిలోమీటర్లు ఉందన్నారు. అదే ఎయిర్ పోర్ట్ మెట్రో స్పీడ్ 120 మాక్సిమమ్ ఉంటుదని.. 26 నిమిషాల్లో 31 కిలోమీటర్లు రిచ్ అవుతామన్నారు. ఈ ట్రైన్ లిమిటెడ్ స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. న్యూయార్క్, లండన్ దేశాల్లో ఉన్న బెస్ట్ ఫెసిలిటీస్ ను ఎయిర్ పోర్ట్ మెట్రోకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. 


మొదట మూడు కోచ్‌లుగా ట్రాక్‌పైకి 


ఎయిర్‌పోర్టు మెట్రో ట్రైన్స్ కు మూడు కోచ్ లు.. ఆ తర్వాత అవసరాన్ని బట్టి 6 కోచ్ లకు డిజైన్ చేశామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పీక్ అవర్స్ లో ప్రతి 8 నిమిషాలకు.. నాన్ పిక్ అవర్ లో ప్రతీ 20 నిమిషాలకు ఒక ట్రైన్ నడుస్తుందని.. ఆ తర్వాత 2.5 నుండి 5 నిమిషాలకు ఒక ట్రైన్ ఆపరేట్ చేస్తామన్నారు. సీబీఐటీసీ టెక్నాలజీతోనే ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మిస్తున్నామన్నారు. సీసీ కెమెరాలతో సెక్యూరిటీ ఉందని తెలిపారు.  రానున్న రోజుల్లో కేవలం ఎయిర్ పోర్ట్ పాసింజర్సే కాకుండా సిటీ అవుట్ స్కర్ట్ లో ఉండే వారు సిటీకి వచ్చేందుకు ఎయిర్ పోర్ట్ మెట్రో సెకండ్ ఫేజ్ ఉంటుందని.. దీనిపై జనరల్ కన్సల్టెంట్ తో ఇప్పటికే చర్చలు జరుపుతున్నామన్నారు. ఫస్ట్ ఫేజ్ లో 300 కోర్టు కేసులను గెలిచి.. 3000 ఎకరాల భూమి సేకరణ జరిగిందని తెలిపారు. నూతన టెక్నాలజీతో ఎయిర్ పోర్ట్ మెట్రోను పూర్తి చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.


అందుబాటులోకి వస్తే మెరుగైన ప్రయాణ సౌకర్యం 


శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఇప్పటివరకు కేవలం రోడ్డు మార్గమే అందుబాటులో ఉంది. దీంతో ఐటీ కారిడార్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారంతా క్యాబులను, సొంత వాహనాలను వినియోగించేవారు. వీరికి ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువగానే వృథా అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న ఎయిర్‌పోర్టు ఎక్స్‌ ప్రెస్‌ ప్రాజెక్టు రానున్న 3 సంవత్సరాల్లో పూర్తయితే ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు అతి త్వరగా విమానాశ్రాయానికి వెళ్లే వెసులుబాటు దొరుకుతుంది. ఇంతే కాకుండా వారికి ప్రయాణ ఖర్చు కూడా కలిసిరానుంది. కేవలం ఐటీ ఉద్యోగులే కాకుండా విమానాశ్రయానికి వెళ్లే ఇతర ప్రయాణికులకు కూడా ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు కలిసిరానుంది. ఎక్కడ మెట్రో ఎక్కినా రాయదుర్గం వచ్చి ఎయిర్‌పోర్టుకు వెళ్లే సౌకర్యం అందుబాటులోకి రానుంది.