Bandi Sanjay on Sajjala Comments : ఏపీ, తెలంగాణ కలపడమే తమ లక్ష్యమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ను పక్కకు పోయేందుకు, వైసీపీ నాయకులతో కలిసి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. కమీషన్ల ఒప్పందంతో స్కామ్ ల విషయం పక్కకు పోయేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కరెంట్ మోటార్లకు కేంద్రం మీటర్లను ఏర్పాటు చేయబోతోందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్.... రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా మోటార్లకు మీటర్లు పెట్టడం అసాధ్యమన్నారు. కేంద్రం చేసిన కొత్త చట్టంలో కూడా మీటర్లకు మోటార్లను ఏర్పాటు చేయాలనే ఊసే లేదని తెలిపారు. సవాల్ చేస్తున్నా... మోటార్లకు కేంద్రం మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ మీటర్లు పెడితే దానికి పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని... మీటర్లు పెట్టకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతావా?కేసీఆర్‌కు అంటూ సవాల్ విసిరారు.
"కవితపై లిక్కర్ కేసులు పక్కదోవ పట్టించేందుకు రాష్ట్రాలు కలపాలని చర్చ తీసుకొచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మాట్లాడుకుని ఇలా కొత్త చర్చలు బయటకు తీస్తున్నారు. ఇదంతా గూడుపుఠానీ. క్యాసినో స్కామ్, ఇతర స్కామ్ లలో విచారణ జరగకుండా ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు బీజేపీ మద్దతుతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. బీజేపీ నేతలు ఓటు వేయడంతోనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఓటింగ్ లో పాల్గొనలేదు. దొంగ దీక్ష చేసిండు. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి తన బిడ్డపై కేసులు ఉల్టా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన ఒప్పుకునే పరిస్థితి లేదు. కృష్ణా జలాలు విషయంలో సీఎం కేసీఆర్ మోసం చేసిండు." - బండి సంజయ్
సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే?
అప్పుడూ, ఇప్పుడూ వైసీపీ విధానం సమైక్య రాష్ట్రమే అని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుదిరితే ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే వైసీపీ విధానమని స్పష్టం చేశారు. మళ్లీ ఏపీ ఉమ్మడి రాష్ట్రం కాగలిగితే మొదట స్వాగతించేది వైసీపీనే అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచీ పోరాటం చేసింది వైఎస్ఆర్సీపీనే అని గుర్తుచేశారు. కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలిగితే మళ్లీ కలవాలని సుప్రీంకోర్టు అంటే కావాల్సింది ఏముందని సజ్జల అన్నారు. విభజన హామీల అమలు కోసం వైసీపీ ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందన్నారు.
మా ఉద్దేశం అదే
"ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావిస్తున్న కేసు 2014 విభజన చట్టంపై వేసిన కేసుగా నేను భావిస్తున్నా. విభజన చట్టం అసంబద్ధం అనే అంశంపై కేసు వేసినట్లున్నారు. ఇంతకాలం తర్వాత, నిన్ననే ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యారన్నది నాకూ అర్థం కావడం లేదు. సాంకేతికంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి భావం స్ఫురించేందేమో అనుకోవాల్సి వస్తుంది. అవకాశం ఉంటే ఎప్పుడైనా సరే కుదిరితే అందరం కలిసి రావాలని, ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ప్రాక్టికల్‌గా ఇంత దూరం వచ్చిన తర్వాత పెండింగ్ అంశాలపై ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉండవల్లి మాటలు కొన్ని అసందర్భంగా ఉన్నట్లు, పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డిని విమర్శించారని అనిపించింది. ఆనాడు రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది బీజేపీ. వారికి సహకరించి టీడీపీ అన్యాయం చేస్తే, చివరి నిమిషం వరకూ విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇక విధిలేని పరిస్థితుల్లో విభజన జరిగిన తర్వాత విభజన హామీల కోసం మా పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. దౌత్యపరంగా, కోర్టుల్లో ఉన్న అంశాలపై పోరాటం చేస్తుంది మా పార్టీనే. ఉండవల్లికి ఆ అనుమానం ఎందుకు వచ్చిందో కానీ మా నేత జగన్మోహన్‌రెడ్డిది ఒకటే విధానం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజన చేసిన అంశంపై మాకు బాధగానే ఉంది. మాకంటే బలంగా జగన్మోహన్‌రెడ్డి ఆ బాధ ఎక్కువగా ఉంది. ఎక్కడ అవకాశం వచ్చినా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే ముందుగా స్వాగతించేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే" -సజ్జల రామకృష్ణా రెడ్డి